20 రోజులు గడిచినా స్పందించని బడంగ్‌పేట్ మున్సిపల్ అధికారులు
డ్రైనేజీ వ్యర్థాలు తొలగింపులో తీవ్ర నిర్లక్ష్యం
నెలలుగా డ్రైనేజీ సమస్యతో అల్మాస్‌గూడ సీఎంఆర్ కాలనీ ప్రజల అవస్థలు

అల్మాస్‌గూడ, జూలై 15 (ఆయుధం ప్రతినిధి): బడంగ్‌పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని అల్మాస్‌గూడ సీఎంఆర్ కాలనీలో పారిశుద్ధ్య నిర్వహణ పూర్తిగా గాడి తప్పిందని స్థానికులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు ఇటీవల డ్రైనేజీ కాలువలను శుభ్రం చేసినప్పటికీ, అందులో నుంచి వెలికితీసిన మురుగు, చెత్త, పూడికను నిబంధనల ప్రకారం రెండు రోజుల్లో తరలించాల్సి ఉండగా, దాదాపు 20 రోజులుగా రోడ్డుపక్కనే వదిలేయడం తీవ్ర విమర్శలకు తావిస్తోంది. పేరుకుపోయిన వ్యర్థాల నుంచి దుర్వాసన వెదజల్లడంతో పాటు దోమలు, ఈగలు అధికమై ప్రజలు నిత్యం ఇబ్బందులు పడుతున్నారు.
స్థానికులు చెబుతున్న వివరాల ప్రకారం, కాలనీలో డ్రైనేజీ వ్యవస్థ నెలలుగా సక్రమంగా పనిచేయడం లేదు. చిన్నపాటి వర్షం కురిసినా మురుగునీరు రోడ్లపైకి చేరి ఇళ్ల ముందు నిల్వ ఉండడంతో ప్రజల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు, వృద్ధులు, మహిళలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వారు తెలిపారు. మురుగునీరు నిల్వ ఉండడం వల్ల ప్రజారోగ్యానికి ముప్పు ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
సమస్య పరిష్కారం కోసం మున్సిపల్ కార్పొరేషన్ రూపొందించిన MyCure మొబైల్ యాప్ ద్వారా పలుమార్లు ఫిర్యాదులు నమోదు చేసినప్పటికీ అధికారులు స్పందించలేదని కాలనీవాసులు ఆరోపిస్తున్నారు. యాప్‌లో ఫిర్యాదులు నమోదు చేసినా అవి పెండింగ్‌లోనే ఉండిపోతున్నాయని, సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలన కూడా చేయడం లేదని వారు అసంతృప్తి వ్యక్తం చేశారు.
అధికారులను నేరుగా కలిసి సమస్యను వివరించిన ప్రతిసారీ నిధులు లేవు, త్వరలో పరిష్కరిస్తాం అనే సమాధానాలే వస్తున్నాయని, కానీ ఇప్పటి వరకు ఎలాంటి శాశ్వత చర్యలు చేపట్టలేదని స్థానికులు విమర్శిస్తున్నారు. ప్రజల నుంచి పన్నులు వసూలు చేసే మున్సిపల్ యంత్రాంగం కనీస పారిశుద్ధ్య సేవలు కూడా అందించడంలో విఫలమవుతోందని మండిపడుతున్నారు.
డ్రైనేజీ వ్యర్థాలను వెంటనే తొలగించి కాలనీని పరిశుభ్రంగా మార్చాలని, దెబ్బతిన్న డ్రైనేజీ వ్యవస్థకు శాశ్వత పరిష్కారం చూపాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. వర్షాకాలం నేపథ్యంలో పరిస్థితి మరింత దిగజారే ప్రమాదం ఉందని, ఇప్పటికైనా బడంగ్‌పేట్ మున్సిపల్ అధికారులు స్పందించి తక్షణ చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
అధికారులు ఇకపై కూడా నిర్లక్ష్య వైఖరినే కొనసాగిస్తే ప్రజాప్రతినిధులతో కలిసి ఆందోళన కార్యక్రమాలు చేపట్టి తమ సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని కాలనీవాసులు హెచ్చరించారు. ప్రజల ఆరోగ్యం, పారిశుద్ధ్య పరిరక్షణ విషయంలో మున్సిపల్ అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించి తక్షణమే సమస్యలను పరిష్కరించాలని వారు విజ్ఞప్తి చేశారు.