హైదరాబాద్ మే 20 (ఆయుధం న్యూస్ ) దేశవ్యాప్తంగా జరుగుతున్న లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి, తెలంగాణ రాష్ట్రంనుండి 17 లోక్‌సభ స్థానాలకు జరిగిన ఎన్నికల ఓట్ల లెక్కింపు మే 23వతేదీన చేపడుతున్న దృష్ట్యా, ఎటువంటి లోటుపాట్లకు అవకాశం లేకుండా పకడ్బందీగా జరపడానికి సంబంధించి జిల్లా ఎన్నికల ప్రధాన అధికారులకు, రిటర్నింగ్ అధికారులకు, సహాయ రిటర్నింగ్ అధికారులకు ఈరోజు హైదరాబాద్‌లో రెండవ విడత శిక్షణ, పునశ్చరణ కార్యక్రమాలను రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి డా.రజత్ కుమార్ ఆధ్వర్యంలో, కేంద్ర ఎన్నికల కమీషన్ సీనియర్ కన్సల్టెంట్ శ్రీ భన్వర్ లాల్ పర్యవేక్షణలో నిర్వహించడం జరిగింది.
ఓట్ల లెక్కింపుకు సంబంధించిన చట్టపరమైన అంశాలతోపాటూ, కౌంటింగ్‌కు ముందు, తరువాత దశలవారీగా తీసుకోవాల్సిన చర్యలపై ఎన్నికల అధికారులకు సవివరంగా తెలియచేయడం జరిగింది. స్ట్రాంగ్ రూమ్‌లు తెరిచే సమయంలో అభ్యర్థులు, ఏజంట్లు, పరిశీలకులు తప్పనిసరిగా అక్కడ ఉండడం వంటి కేంద్రఎన్నికల సంఘం ఆదేశాలను, మార్గదర్శకాలను కచ్చితంగా పాటిస్తూ విమర్శలకు, ఆరోపణలకు ఎటువంటి అవకాశం ఇవ్వకుండా చూడాలని వారికి స్పష్టం చేసారు. లెక్కింపు ప్రక్రియకు తుది రూపం ఇవ్వడానికి మొదటి రెండు రౌండ్లు దశలవారీగా ఎలా లెక్కించాలో ఆ సమయంలో ఎఆర్‌ఓలు ఎలా అప్రమత్తంగా ఉండాలో వారికి వివరించారు.
రిటర్నింగ్ అధికారుల, పరిశీలకులకున్న పరిమితులు అలాగే వారికున్న అధికారాలు వాటిని ఎలా వినియోగించాలో వివరిస్తూ, కౌంటింగ్ ప్రక్రియ ముగిసిన తరువాత ఓటింగ్ యంత్రాల భద్రత, ఎన్నికల తాలూకు రికార్డులు, పత్రాలను ఎలా సీలు వేయాలి, ఫలితాల ప్రకటనను ఎన్నికల సంఘానికి నిర్దేశిత ఫారాలలో ఎలా నింపి పంపాలన్న విషయాలపై కూడా అవగాహన కల్పించడం జరిగింది.
ఇటిపిబిఎస్ వంటి అధునాతన టెక్నాలజీని మొదటిసారిగా వినియోగిస్తున్నందువల్ల దానికి అవసరమయిన మౌలికసదుపాయాలను సమకూర్చుకోవడం, ఎన్వలప్ లమీద క్యూఆర్ కోడ్ వంటి వి స్కాన్ చేయడం వంటి అంశాలను దానికి సంబంధించిన విషయ నిపుణులు వివరించారు.
ఓట్ల లెక్కింపులో సువిధ అనే అప్లికేషన్ ను ఎలా ఉపయోగించాలో కూడా మాస్టర్ ట్రైనర్ లు వివరించడం జరిగింది. సువిధ పోర్టల్ లో డేటా ఎంట్రీ జరిగిన తరువాతనే ఆ రౌండ్ ఫలితాలను ప్రకటించాల్సి ఉంటుందని కూడా వారికి స్పష్టం చేయడంజరిగింది. 21వ తేదీన ఓట్ల లెక్కింపు సన్నద్ధతను పూర్తిస్థాయిలో పరీక్షించి చూసుకోవడానికి డ్రెస్ రిహార్సల్ నిర్వహించాలని కూడా వారిని ఆదేశించడం జరిగింది.
దేశవ్యాప్తంగా మే 23 న ఓట్ల లెక్కింపు జరుగుతున్న దృష్ట్యా అందరి దృష్టి ఈవిఎంల మీద ఉంటుందనీ, ఎక్కడా అజాగ్రత్తకు అవకాశం లేకుండా లెక్కింపు ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేయాలని డా.రజత్ కుమార్ సూచించగా, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఎన్నికల కమీషన్ తీవ్రంగా పరిగణించి శిక్షలు కూడా విధించే అవకాశముందని శ్రీ భన్వర్ లాల్ హెచ్చరించారు.