బిజెపి రాష్ట్ర అధ్యక్షులు ఎన్. రాంచందర్ రావు నేతృత్వంలోని పార్టీ ప్రతినిధుల బృందం ఈరోజు తెలంగాణ రాష్ట్ర డీజీపీని కలిసి వినతిపత్రం సమర్పించారు.ముఖ్యంగా నల్గొండ జిల్లా చండూరులో బిజెపి నాయకులపై జరిగిన హత్యాయత్నాన్ని డీజీపీ దృష్టికి తీసుకెళ్లారు. ఈ దాడిలో బిజెపి నాయకులు, కార్యకర్తలకు తీవ్ర గాయాలైనప్పటికీ, పోలీసులు నిందితులకు అనుకూలంగా బలహీనమైన సెక్షన్లతో కేసు నమోదు చేయడాన్ని ఖండించారు. అలాగే వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గంలో బిజెపి కార్యకర్తలపై కాంగ్రెస్ నాయకులు చేసిన దాడిలో స్థానిక పోలీసులు ఏకపక్షంగా వ్యవహరించడంపై నిరసన వ్యక్తం చేశారు. బాధితులపైనే కేసులు పెట్టడం పోలీసుల పక్షపాతానికి నిదర్శనమని మండిపడ్డారు. అదేవిధంగా మున్సిపల్ ఎన్నికల ప్రచార సమయంలో బిజెపి నల్గొండ జిల్లా అధ్యక్షుడి పట్ల డీఎస్పీ అనాగరికంగా వ్యవహరించిన తీరును ఫిర్యాదులో పేర్కొన్నారు.అధికార కాంగ్రెస్ పార్టీ కనుసన్నల్లో పనిచేస్తూ, ప్రతిపక్ష బిజెపి కార్యకర్తలను ఇబ్బంది పెడుతున్న పోలీసు అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని, బాధితులకు న్యాయం చేయాలని డీజీపీ గారిని బిజెపి బృందం డిమాండ్ చేసింది. ఈ బృందంలో బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు జయశ్రీ, సీనియర్ నాయకులు మారుతీ కిరణ్ , రామకృష్ణ మరియు సీనియర్ న్యాయవాది ఆంథోనీ రెడ్డి , తదితరులు పాల్గొన్నారు.