ఇరాన్‌, ఇజ్రాయెల్‌ మధ్య యుద్ధం.. దుబాయ్‌లో చిక్కుకుపోయిన మంత్రి తుమ్మల

హైదరాబాద్  మార్చ్ 2 (ఆయుధం న్యూస్ );ఇరాన్‌, ఇజ్రాయెల్‌ మధ్య యుద్ధం నేపథ్యంలో రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు దుబాయ్‌లో చిక్కుకుపోయారు. తన కుటుంబసభ్యుల చికిత్స కోసం దుబాయ్‌ వెళ్లిన ఆయన.. విమానాల రద్దుతో అక్కడే ఇరుక్కుపోయారు.ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మృతి తర్వాత గల్ఫ్ దేశాల్లో యుద్ధ జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. ప్రతీకారం తీర్చుకునేందుకు ఇజ్రాయెల్, పశ్చిమాసియాలోని అమెరికా స్థావరాలపై ఇరాన్ క్షిపణులతో విరుచుకుపడుతున్నది. యూఏఈ, కువైట్‌, ఖతార్‌, బహ్రెయిన్‌, ఇరాక్‌ దేశాల్లో అమెరికా సైనిక స్థావరాలతోపాటు విమానాశ్రయాలు, ఇతర సముదాయాలను లక్ష్యంగా చేసుకొని ఇరాన్‌ క్షిపణుల దాడి చేస్తున్నది. ఈ క్రమంలో దుబాయ్‌లోని ఎయిర్‌పోర్టుల్ని మూసివేశారు. ఫలితంగా విమాన రాకపోకలు నిలిచిపోయాయి. ఈ క్రమంలోనే తన బంధువులను పరామర్శించేందుకు వెళ్లిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అక్కడే చిక్కుకుపోయారు.తన కుటుంబసభ్యుల్లో ఒకరికి అనారోగ్య కారణాల రీత్యా చికిత్స కోసం ఐదు రోజుల క్రితం తుమ్మల నాగేశ్వరరావు దుబాయ్‌కు వెళ్లారు. ఇంతలోనే దుబాయ్‌పై ఇరాన్ దాడులు చేస్తుండటంతో అక్కడి ప్రభుత్వం అన్ని విమానాలను రద్దుచేసింది. దీంతో దుబాయ్‌లో సురక్షితంగానే ఉన్నప్పటికీ, ఎయిర్‌పోర్టు క్లియరెన్స్ ఇచ్చేంత వరకు ఇండియాకు తిరిగిరాలేని పరిస్థితి నెలకొంది.