కాంగ్రెస్ ఎమ్మెల్యే మందుల సామేల్ ప్రవర్తిస్తున్న తీరు హేయనీయం
బిజెపి ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి ఎస్.కుమార్
హైదరాబాద్ మార్చ్16 (ఎక్స్ ప్రెస్ న్యూస్ ) నికార్సైన హిందువులు, నిజంగా ధర్మాన్ని పాటించే వారు ఎవరు అంటే, మొదటి నుంచి కూడా దళిత సమాజమే ముందుంటుందని బిజెపి ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి ఎస్.కుమార్ అన్నారు.భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ వారి కుటుంబ సంప్రదాయాలు, పూజా విధానాలు, గ్రామీణ సంస్కృతి పల్లెల్లో పోచమ్మ, మైసమ్మ నుంచి మొదలుకొని ప్రతి ఆరాధనలో దళితుల పాత్ర ఎంతో గౌరవనీయంగా ఉంటుంది. బ్రాహ్మణులను గౌరవించడం గానీ, సమాజంలోని ఇతర వర్గాలను గౌరవించడం గానీ.. సమాజంతో కలిసిమెలిసి జీవించే స్వభావం దళితులదేనన్నారు. అలాంటి దళిత సమాజంలో పుట్టిన వ్యక్తిగా చెప్పుకుంటూ, ఈరోజు కాంగ్రెస్ ఎమ్మెల్యే మందుల సామేల్ ప్రవర్తిస్తున్న తీరు పూర్తిగా అసహజంగా కనిపిస్తోంది. మంత్రి పదవి రాలేదనే అసంతృప్తి, ముఖ్యంగా అడ్లూరి లక్ష్మణ్ గారికి మంత్రి పదవి రావడంతో సామేల్ కునన అసంతృప్తి కారణంగా, ప్రభుత్వం పట్ల, హిందూ సమాజం పట్ల, కాంగ్రెస్ వేదికలనే ఉపయోగించుకొని అసహనం వ్యక్తం చేస్తున్నట్టుగా అనిపిస్తోందన్నారు. మాదిగ సమాజానికి మంత్రి పదవి ఇవ్వాలని కాంగ్రెస్‌లో కొందరు ఎమ్మెల్యేలు కలిసి డిమాండ్ చేసిన విషయం వాస్తవమే. అయితే పార్టీ ప్రాధాన్యతల ప్రకారం లక్ష్మణ్ కుమార్ మంత్రి పదవి ఇచ్చిన తర్వాత నుంచి సామేల్ గారి వ్యవహార శైలి గమనిస్తే, అది ఒక రాజకీయ నాయకుడి సమతుల్యత కంటే వ్యక్తిగత అసంతృప్తి ఆధారంగా నడుస్తున్నట్టు కనిపిస్తోంది. ప్రతి సందర్భంలో హిందూ సమాజం పట్ల, వేదికపై ఉన్న నాయకుల పట్ల నర్మగర్భ వ్యాఖ్యలు చేయడం ఆయన అలవాటుగా మారింది. ఇటీవల కబ్బంపల్లి సత్యనారాయణ గారి ప్రమాణ స్వీకార కార్యక్రమంలో కూడా మరో దళిత నాయకుడు ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భంలో అవసరం లేని వ్యాఖ్యలు చేయడం సమాజం మొత్తం గమనించిందని తెలిపారు. ఆయన వ్యాఖ్యలపై సమాజంలో తీవ్ర అసంతృప్తి ఉంది. తన నియోజకవర్గ ప్రజలే భవిష్యత్తులో సరైన బుద్ధి చెబుతారని అక్కడి ప్రజల్లో చర్చ జరుగుతోంది. అదే ప్రాంతం నుంచి వచ్చిన కొందరు నాయకులు కూడా ఇలాంటి అసహనంతో మాట్లాడటం దురదృష్టకరం. ఒకరికి ఎమ్మెల్యే టికెట్ రాలేదని, ఇంకొకరికి మంత్రి పదవి రాలేదని, ఆ అసంతృప్తిని బిజెపి మీద గానీ, హిందుత్వం మీద గానీ, బ్రాహ్మణ సమాజం మీద గానీ చూపించడం సరైంది కాదన్నారు.కాంగ్రెస్ పార్టీ టికెట్‌పై గెలిచిన దళిత ఎమ్మెల్యేలు ముందు తమ సమాజానికి ఇచ్చిన హామీల గురించి మాట్లాడాలి. రాష్ట్రవ్యాప్తంగా దళితుల కోసం తీసుకున్న దరఖాస్తులు, ప్రకటించిన రూ.5 లక్షల ఆర్థిక సహాయం, రాజీవ్ యువ వికాసం వంటి పథకాలు.. ఇవన్నీ ఏ దశలో ఉన్నాయి? దరఖాస్తులు కలెక్టరేట్లలో పేరుకుపోయాయి కానీ లబ్ధిదారులకు సహాయం అందడం లేదు. బడ్జెట్‌లో దళితుల కోసం కేటాయించిన నిధులు ఎక్కడ వినియోగమవుతున్నాయి? ఎందుకు ఖర్చు కాకుండా సరెండర్ అవుతున్నాయి? రాబోయే బడ్జెట్ సమావేశాల్లో ఈ విషయాలపై దళిత ఎమ్మెల్యేలు మాట్లాడాలని కుమార్ డిమాండ్ చేసారు.దళిత సమాజం ముందుకు వెళ్లి, తమ హామీలు నెరవేర్చలేకపోయినందుకు క్షమాపణ చెప్పాల్సిన బాధ్యత కాంగ్రెస్ దళిత ఎమ్మెల్యేలపై ఉంది. దళితుల అభివృద్ధి కోసం, వారికి ప్రకటించిన పథకాల కోసం ప్రభుత్వం దగ్గర పోరాడకుండా, దారి మళ్లించి ఇతర అంశాలపై మాట్లాడటం సమంజసం కాదు. ఏ సమాజం నుంచి గెలిచి వచ్చారో, ఆ సమాజం కోసం ముందుగా ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి. మీ నియోజకవర్గంలో ఎంతమందికి రుణాలు వచ్చాయి? ఎంతమంది దరఖాస్తుదారులకు సహాయం అందింది? ఈ లెక్కలు ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేసారు. ఇంకొకరికి పదవి వస్తే అసహనం, ఇంకొకరికి మంత్రి పదవి వస్తే అసంతృప్తి — ఈ వ్యక్తిగత అసంతృప్తిని సమాజంలో పెద్ద అంశంగా చూపించాలనుకోవడం రాజకీయ పరిపక్వత కాదు. అందుకే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దళిత సమాజానికి ప్రభుత్వం ఏమి చేసిందో వైట్ పేపర్ విడుదల చేయాలని డిమాండ్ చేసారు. అలాగే ఇలాంటి వ్యాఖ్యలు చేసిన వారిపై కనీసం షోకాజ్ నోటీసులు ఇవ్వాలి. కాంగ్రెస్ పార్టీలో బ్రాహ్మణులు లేరా? మంత్రులు లేరా? ప్రభుత్వం లోపలే అనేక విభేదాలు, వాటాలపై గొడవలు జరుగుతున్న దృశ్యాలు ప్రజలందరూ చూశారు. అలాంటి పరిస్థితిలో సమాజానికి ఏమి చేస్తారు? ఇచ్చిన 420 హామీల్లో నాలుగు కూడా సక్రమంగా అమలు కాలేదనే భావన ప్రజల్లో ఉందమన్నారు. సామేల్ లాంటి వారు నిజంగా దళిత సమాజం నుంచి వచ్చామని భావిస్తే, ముందుగా తమ ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి. ఆశీర్వదించడానికి వచ్చిన వారిని విమర్శించడం కాదు; సమాజ ప్రయోజనాల కోసం మాట్లాడాలన్నారు.ఈ మీడియా సమావేశంలో బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి కప్పర ప్రసాద్ బిజెపి ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కాంతికిరణ్ , బిజెపి రాష్ట్ర కార్యదర్శి కొప్ప భాషా , మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు , బిజెపి ధార్మిక సెల్ కన్వీనర్ సూర్యప్రకాష్ తక్దితరులు పాల్గొన్నారు. పాల్గొన్నారు.'
