20న రాష్ట్ర బడ్జెట్.. బీఏసీ సమావేశంలో నిర్ణయం
హైదరాబాద్ మార్చ్ 16 (ఆయుధం న్యూస్ ); : తెలంగాణ అసెంబ్లీ , శాసన మండలి బడ్జెట్ సమావేశాలు ఈనెల 30వ తేదీ వరకు జరుగనున్నాయి. ఈ మేరకు సోమవారం స్పీకర్ ఛాంబర్‌లో జరిగిన బీఏసీ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఈనెల 31 వరకు నిర్వహించాలని బీఆర్‌ఎస్ సభ్యులు కోరగా సీఎంతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. కాగా సోమవారం తొలిరోజు గవర్నర్ శివప్రతాప్ శుక్లా ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు. అనంతరం సమావేశం రేపటికి వాయిదా పడింది. ఈనెల 17,18 తేదీల్లో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ, 19న ఉగాది పండుగ సందర్భంగా ఉభయ సభలకు సెలవును ప్రకటించారు. 20న ప్రారంభమయ్యే సమావేశాల్లో అసెంబ్లీలో ఉపముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క, మండలిలో శాసనసభా వ్యవహారాల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. 21న రంజాన్, 22న ఆదివారం సందర్భంగా ఉభయ సభలకు విరామం, 23 నుంచి సమావేశాలు కొనసాగనున్నాయి. అయితే బీఆర్‌ఎస్ కోరిక మేరకు ఆదివారం కూడా సమావేశం ఉంటుందని మాజీ మంత్రి హరీష్‌రావు తెలిపారు.
