ఎస్ఐఆర్ ప్రక్రియను ప్రారంభించాలని, ప్రస్తుతం తెలంగాణ పర్యటనలో

 ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియపై ప్రధాన ఎన్నికల కమిషనర్‌ (సీఈసీ) జ్ఞానేశ్‌ కుమార్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. తదుపరి ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ తెలంగాణలోనే అని తెలిపారు. ప్రస్తుతం తెలంగాణ పర్యటనలో ఉన్న ఆయన ఇవాళ రవీంద్ర భారతిలో బీఎల్‌వోల సమావేశంలో పాల్గొన్నారు. ఈమేరకు ఈ వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలోనూ ఎస్‌ఐఆర్‌ ను విజయవంతం చేద్దామని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో సగటున ఒక్కో బీఎల్‌వోకు 930 మంది ఓటర్లు వస్తారని జ్ఞానేశ్‌ కుమార్‌ స్పష్టం చేశారు.


కేంద్ర ఎన్నికల సంఘం ఈ ఏడాది జులైలో కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించడానికి ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) నిర్వహించడం చాలా ముఖ్యమని స్పష్టం చేసింది. ఓటర్ల జాబితాల సమగ్రతను కాపాడటానికి దేశవ్యాప్తంగా ఎస్ఐఆర్ ప్రక్రియను ప్రారంభించాలని నిర్ణయం తీసుకుంది. దేశంలోని అన్ని ప్రాంతాల్లోనూ ఎస్ఐఆర్ ప్రక్రియ కోసం షెడ్యూల్ ను నిర్ణీత సమయంలో జారీ చేస్తామని వెల్లడించింది. ఈ క్రమంలో తాజాగా తెలంగాణలోనూ ఎస్ఐఆర్ ప్రక్రియ ఉండనున్నట్లు ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్ కుమార్ తాజాగా స్పష్టం చేశారు.


ప్రస్తుతం తెలంగాణ పర్యటనలో ఉన్న జ్ఞానేశ్ కుమార్ ఇవాళ హైదరాబాద్ లోని రవీంద్ర భారతిలో బీఎల్‍వోలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రస్తుతం 12 రాష్ట్రాల్లో ఎస్ఐఆర్ అమలవుతోందని అన్నారు. రానున్న రోజుల్లో తెలంగాణలోనూ ఈ ప్రక్రియను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ మేరకు కెనడా కంటే తెలంగాణ పెద్దది అని తెలిపారు.


ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియను తొలుత బీహార్‌ రాష్ట్రంలో ప్రయోగాత్మకంగా నిర్వహించారు. ఈ ప్రక్రియ అక్కడ పూర్తయింది. రెండో విడతలో 9 రాష్ట్రాలు, 3 కేంద్రపాలిత ప్రాంతాలు అయిన ఉత్తరప్రదేశ్‌, తమిళనాడు, పశ్చిమబెంగాల్‌, రాజస్థాన్‌, కేరళ, మధ్యప్రదేశ్‌, గుజరాత్‌, ఛత్తీస్‌ ఘడ్‌, గోవా, పుదుచ్చేరి, అండమాన్‌ నికోబార్‌, లక్షద్వీప్‌ లో నిర్వహిస్తామని అక్టోబర్‌ 27న ప్రధాన ఎన్నికల కమిషన్ స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ఇక మూడో విడత తెలంగాణతోపాటు మరికొన్ని రాష్ట్రాల్లో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియ ప్రారంభం కానున్నట్టు తెలుస్తోంది.