బెంగళూరు ట్రాఫిక్ గురించి ప్రత్యేకించి చెప్పుకోనక్కర్లేదు. అర్ధరాత్రి, అపరాత్రి అనే తేడా లేకుండా ట్రాఫిక్ జామ్ అనేది సర్వసాధారణం ఇక్కడ. బెంగళూరు నుంచి హైదరాబాద్, చెన్నై, ముంబై వంటి ప్రధాన నగరాలకు వైపు వెళ్లే మార్గాల్లో ప్రైవేట్ బస్సుల వల్ల రాత్రిళ్లు కూడా హెవీగా వాహనాల రాకపోకలు స్తంభించిపోతుంటాయి. దీనిదెబ్బకు కొన్ని ప్రైవేట్ సంస్థలు తమ కార్యలయాలను ఇతర ప్రాంతాలు, నగర శివార్లకు రీలొకేట్ అయిన సందర్భాలు సైతం లేకపోలేదు.
ఈ ట్రాఫిక్ కష్టాలను తొలగించడానికి బెంగళూరు డెవలప్మెంట్ అథారిటీ అధికారులు ఫ్లైఓవర్ల విస్తరణ చేపట్టారు. వాహనాల తాకిడి అధికంగా ఉండే మార్గాల్లో ఫ్లైఓవర్లను విస్తరిస్తోన్నారు. ఇప్పుడున్న వాటికి అదనంగా లూప్ లను నిర్మిస్తోన్నారు. అత్యంత రద్దీగా ఉండే హెబ్బాళ ఫ్లైఓవర్ విస్తరణ, లూప్ నిర్మాణ పనులు పూర్తయ్యాయి. శనివారం అర్ధరాత్రి దాటినప్పటి నుంచీ ఇది అందుబాటులోకి వచ్చింది. వాహనదారులకు అనుమతి ఇచ్చారు.
నగర శివార్లల్లో ఉండే కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంతో పాటు హైదరాబాద్ వైపు రాకపోకలు సాగించే వాహనాలను ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ కొత్త లూప్ యలహంక, జక్కూరు, సహకార నగర్ వంటి నార్త్ బెంగుళూరు ప్రాంతాల నుండి సిటీలోనికి వచ్చే వాహనదారులు, దూర ప్రాంతాల ప్రయాణికులకు ట్రాఫిక్ కష్టాలు తప్పాయి. బెంగళూరు డెవలప్మెంట్ అథారిటీ, బెంగళూరు ట్రాఫిక్ పోలీసులు వాహనాల కదలిక, రాకపోకలు, పీక్ అవర్ ట్రాఫిక్ వంటి గురించి ఆరా తీయనున్నారు.
దీని ఆధారంగా అవసరమైతే చిన్నపాటి మార్పులు లేదా ట్రాఫిక్ మళ్లింపులను ప్రవేశపెట్టే అవకాశాలను పరిశీలిస్తారు. వాహనదారులకు మార్గనిర్దేశం చేయడానికి, కొత్త లూప్ అందుబాటులోకి వచ్చాక తలెత్తే గందరగోళాన్ని నివారించడానికి చుట్టూ బారికేడ్లు, సైన్‌బోర్డులను ఏర్పాటు చేశారు. ట్రాఫిక్ సిబ్బందిని మోహరించారు. ప్రయాణికులు సూచిక బోర్డులను అనుసరించాలని, విధుల్లో ఉన్న ట్రాఫిక్ పోలీసులకు సహకరించాలని అధికారులు సూచించారు.