మరణంలోనూ వీడని అన్నదమ్ముల అనుబంధం..! సంతాపం తెలిపిన జడ్చర్ల బృందావనం సభ్యులు

ఒకరు చనిపోయిన వెంటనే మరొకరు గుండెపోటుతో మృతి 


రెండు కుటుంబాల్లో తీవ్ర విషాదం


జడ్చర్ల రూరల్, అక్టోబర్ 10 (ఆయుధం  ప్రతినిధి): జడ్చర్ల పట్టణంలోని హౌసింగ్ బోర్డ్ కాలనీ వాసి సురేందర్ రావు, తన అన్న నరసింహారావు హఠాన్మరణ వార్తను విన్న వెంటనే తీవ్ర గుండెపోటుతో ప్రాణాలు విడిచిన విషాద ఘటన కలకలం రేపుతోంది. వారం రోజులుగా హైదరాబాద్‌లో చికిత్స పొందుతున్న సురేందర్‌రావుకు వనపర్తిలో నివాసం ఉంటున్న అన్న నరసింహారావు మృతి వార్త తెలియగానే గుండెపోటు వచ్చి అక్కడికక్కడే తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.


చిన్ననాటి నుంచి అన్నదమ్ములిద్దరూ ఎంతో అన్యోన్యంగా, ఏ పనైనా కలిసి చేసుకునే వారిగా బంధువులు గుర్తుచేసుకుంటున్నారు. ఒకరికి ఏదైనా అగచాట్లు వచ్చినా మరొకరు కదిలివచ్చే ఈ బంధం చివరి వరకు విడిపోకపోవడమే కాకుండా కేవలం క్షణాల వ్యవధిలోనే ఇద్దరూ పరలోకవాసులు కావడం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ విషాదకర సంఘటనతో జడ్చర్లతో పాటు వనపర్తిలోని రెండు కుటుంబాల్లో కూడా తీవ్ర శోకచాయలు అలముకున్నాయి. కారణంగా మరణించిన అన్నదమ్ముల స్నేహితులు, కాలనీవాసులు శోకసంద్రంలో మునిగిపోయారు. "దేవుడు కూడా వీరి బంధాన్ని మరణంలోనూ విడదీయలేకపోయాడు" అంటూ స్థానికులు బాధ వ్యక్తం చేస్తున్నారు.



సంతాపం తెలిపిన జడ్చర్ల బృందావనం సభ్యులు 

జడ్చర్ల పట్టణానికి చెందిన సురేందర్ రావు ఆకస్మిక మరణం చెందడంతో పట్టణానికి చెందిన బృందావనం సభ్యులు లక్ష్మీ నరసింహా రావు, మంగు ప్రవీణ్ కుమార్,  వి.శిరీష్ కుమార్, వెల్దండ శ్రీధర్ రావు, రాఘవేందర్ రావు తదితరులు సంతాపం తెలిపారు.