అధికంగా ఆందోళ‌న నిద్ర‌లేమి వంటి కార‌ణాల వ‌ల్ల హైబీపీ వ‌స్తుంది


హైదరాబాద్ అక్టోబర్ 11 (ఎక్స్ ప్రెస్ న్యూస్ );ప్ర‌స్తుతం ప్ర‌పంచ వ్యాప్తంగా అధిక శాతం మంది హైబీపీ స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతున్నారు. ఇందుకు అనేక కార‌ణాలు ఉంటున్నాయి. హైబీపీనే హైప‌ర్ టెన్ష‌న్ అని కూడా పిలుస్తారు. ర‌క్త‌నాళాల గోడ‌ల‌పై ర‌క్తం ఎక్కువ పీడ‌నాన్ని క‌లిగిస్తుంది. దీన్నే హైబీపీ అంటారు. ఈ స‌మ‌స్య ఉంటే దీర్ఘ‌కాలంలో సైలెంట్ కిల్ల‌ర్ గా మారే అవ‌కాశాలు ఉంటాయి. దీంతో హార్ట్ ఎటాక్ వ‌చ్చే ముప్పు ఎక్కువ‌గా ఉంటుంది. హైబీపీ వ‌చ్చేందుకు అనేక కార‌ణాలు ఉంటాయి. ఉప్పును అధికంగా తీసుకోవ‌డం, కొవ్వు ప‌దార్థాల‌ను అధికంగా తిన‌డం, శారీర‌క శ్ర‌మ చేయ‌క‌పోవ‌డం, అధికంగా బ‌రువు ఉండ‌డం, మ‌ద్యం ఎక్కువ‌గా సేవించ‌డం, టీ లేదా కాఫీల‌ను ఎక్కువ‌గా తాగ‌డం, పొగ తాగ‌డం, ఒత్తిడి, ఆందోళ‌న అధికంగా ఉండ‌డం, నిద్ర‌లేమి వంటి కార‌ణాల వ‌ల్ల హైబీపీ వ‌స్తుంది. కొందరికి వ‌య‌స్సు మీద ప‌డే కొద్దీ స‌మ‌స్య పెరుగుతుంది. వంశ పారంప‌ర్యంగా కూడా హైబీపీ వ‌చ్చే అవ‌కాశాలు ఉంటాయి. కిడ్నీ వ్యాధులు, థైరాయిడ్, డ‌యాబెటిస్ వంటి వ్యాధులు ఉన్న‌వారికి కూడా హైబీపీ వ‌చ్చే అవ‌కాశాలు ఉంటాయి.


 ల‌క్ష‌ణాలు..


హైబీపీ స‌మ‌స్య ఉన్న‌వారిలో అంద‌రిలోనూ ప‌లు ల‌క్ష‌ణాలు కామ‌న్ గా క‌నిపిస్తాయి. సాధార‌ణంగా బీపీ180/120 mm Hg ఉంటే దాన్ని సాధార‌ణ బీపీ అంటారు. కానీ బీపీ చెక్ చేసిన‌ప్పుడ‌ల్లా లెవ‌ల్స్ ఇంత‌క‌న్నా ఎక్కువ‌గా ఉంటే అప్పుడు వారిని హైబీపీ బారిన ప‌డ్డార‌ని నిర్దారిస్తారు. హైబీపీ వ‌చ్చిన వారిలో త‌ర‌చూ త‌ల‌నొప్పి వ‌స్తుంటుంది. ఉద‌యం ఇది మ‌రింత ఎక్కువ‌గా ఉంటుంది. త‌ల తిర‌గ‌డం, కంటి చూపు మ‌స‌క‌గా మార‌డం, శ్వాస తీసుకోవ‌డంలో ఇబ్బందిగా అనిపించ‌డం వంటి ల‌క్ష‌ణాలు క‌నిపిస్తాయి. అలాగే కొంద‌రిలో ముక్కు నుంచి ర‌క్తస్రావం అవుతుంది. ఇది అత్యంత అరుదుగా సంభ‌విస్తుంది. ఛాతి నొప్పి, చెవులు, మెడ భాగాల్లో పొడిచిన‌ట్లు అనిపించ‌డం, తీవ్ర‌మైన అల‌స‌ట‌, ఆందోళ‌న‌, గుండె అసాధార‌ణ రీతిలో కొట్టుకోవ‌డం వంటి ల‌క్ష‌ణాలు హైబీపీ ఉన్న‌వారిలో క‌నిపిస్తాయి. అయితే తీవ్ర‌మైన త‌ల‌నొప్పిగా ఉండి ఎంత‌కూ త‌గ్గ‌క‌పోయినా, శ్వాస తీసుకోవ‌డం మ‌రింత ఇబ్బంది అవుతున్నా, ఛాతిలో నొప్పి బాగా వ‌స్తున్నా ఏమాత్రం ఆల‌స్యం చేయ‌కుండా వెంట‌నే డాక్ట‌ర్‌ను క‌ల‌వాల్సి ఉంటుంది. లేదంటే ప్రాణాపాయం సంభ‌వించే ప్ర‌మాదం ఉంటుంది.


అధిక రక్తపోటును ఆపడానికి ఆహార విధానాల ను పాటించాలి.. 


హైబీపీ ఉన్న‌వారు డాక్ట‌ర్ ఇచ్చే మందుల‌ను క్ర‌మం త‌ప్ప‌కుండా వాడాల్సి ఉంటుంది. అలాగే ఆహారం విష‌యంలోనూ


ప‌లు మార్పులు చేసుకోవాలి. దీంతో బీపీని గ‌ణ‌నీయంగా నియంత్ర‌ణ‌లో ఉంచ‌వ‌చ్చు. హైబీపీ ఉన్న‌వారు అధిక రక్తపోటును ఆపడానికి ఆహార విధానాలు డైట్‌ను పాటించాల్సి ఉంటుంది. ప్ర‌పంచ వ్యాప్తంగా ప్ర‌స్తుతం ఈ డైట్‌కు ఎంతో ఆద‌ర‌ణ పెరుగుతోంది. కేవ‌లం హైబీపీ ఉన్న‌వారు మాత్ర‌మే కాకుండా, ఇత‌ర వ్య‌క్తులు కూడా ఈ డైట్‌ను పాటించేందుకు ఆస‌క్తిని చూపిస్తున్నారు. ఇందులో భాగంగా త‌క్కువ సోడియం ఉన్న ఆహారాలు, ఎక్కువ పొటాషియం, మెగ్నిషియం, ఫైబ‌ర్ ఉన్న ఆహారాల‌ను తినాల్సి ఉంటుంది. దీంతో బీపీ కంట్రోల్‌లో ఉండ‌డ‌మే కాదు, గుండె కూడా ఆరోగ్యంగా ఉంటుంది.


పండ్లు, కూర‌గాయ‌ల్లో పొటాషియం, మెగ్నిషియం, ఫైబ‌ర్ అధికంగా ఉంటాయి. ఇవి సోడియం స్థాయిల‌ను త‌గ్గిస్తాయి. బీపీని నియంత్ర‌ణ‌లో ఉంచుతాయి. బెర్రీ పండ్ల‌లో ఆంథోస‌య‌నిన్స్ అన‌బ‌డే యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి బీపీని త‌గ్గిస్తాయి. అర‌టి పండ్లు, పాల‌కూర‌, బీట్ రూట్‌, అవ‌కాడోలు, తృణ ధాన్యాలు, ఓట్స్‌, బ్రౌన్ రైస్‌, హోల్ వీట్ బ్రెడ్‌, కినోవా, చేప‌లు, ప‌ప్పు దినుసులు, బ‌ఠానీలు, బాదంప‌ప్పు, గుమ్మ‌డికాయ విత్త‌నాలు, చియా విత్త‌నాలు, వాల్ న‌ట్స్‌, అల్లం, వెల్లుల్లి, ప‌సుపు, మిరియాలు వంటి ఆహారాల‌ను తీసుకుంటుంటే బీపీ నియంత్ర‌ణ‌లో ఉంటుంది. గుండె ఆరోగ్యం మెరుగు ప‌డుతుంది. ఇక హైబీపీ ఉన్న‌వారు రోజూ త‌ప్ప‌నిస‌రిగా 30 నిమిషాల పాటు వ్యాయామం చేయాలి. క‌నీసం తేలిక‌పాటి వాకింగ్ అయినా చేయాల్సి ఉంటుంది. అలాగే త‌గిన‌న్ని గంట‌ల పాటు నిద్రించాలి. ఒత్తిడి, ఆందోళ‌న‌ను త‌గ్గించుకునే ప్ర‌య‌త్నం చేయాలి. దీని వ‌ల్ల హైబీపీ త‌గ్గుతుంది. గుండె ప‌నితీరు మెరుగు ప‌డుతుంది. అన్ని విధాలుగా ఆరోగ్యంగా ఉంటారు.