భారతదేశాన్ని కట్టడి చేయండి .. ప్రపంచ వాణిజ్య సంస్థకు చైనామొర


న్యూ డిల్లీ అక్టోబర్ 15 (ఎక్స్ ప్రెస్  న్యూస్ );భారతదేశాన్ని కట్టడి చేయాలంటూ దాయాది దేశం చైనా ప్రపంచ వాణిజ్య సంస్థ (WTO)కి మొరపెట్టుకుంది. భారతదేశంలో EV(ఎలక్ట్రానిక్ వెహికల్స్), ఇంకా బ్యాటరీ ఉత్పత్తులపై ఆ దేశ ప్రభుత్వం ఇస్తున్న సబ్సిడీలు మా కొంప ముంచుతున్నాయని డబ్ల్యూటీవోకి ఫిర్యాదు చేసింది. ఎలక్ట్రిక్ వాహనాలు, ఇంకా బ్యాటరీ ఉత్పత్తికి సంబంధించిన భారతదేశపు సబ్సిడీ కార్యక్రమాలను సవాలు చేస్తూ.. చైనా ప్రపంచ వాణిజ్య సంస్థకు అధికారిక ఫిర్యాదును దాఖలు చేసింది.పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా వాణిజ్య మంత్రిత్వ శాఖ(MOFCOM) ప్రకారం, భారతదేశం చేస్తున్న సబ్సిడీ చర్యలు, దిగుమతి ప్రత్యామ్నాయ సబ్సిడీలకు సమానమని ఫిర్యాదులో ఆరోపించింది. ఇవి WTO నిబంధనల ప్రకారం నిషేధించబడ్డాయని పేర్కొంది. ఈ సబ్సిడీలు వేగంగా పెరుగుతున్న విద్యుత్ వాహనాలు, బ్యాటరీ రంగాలలో భారతీయ పరిశ్రమలకు అన్యాయమైన పోటీ ప్రయోజనాన్ని ఇస్తాయని కూడా చైనా ఆరోపించింది.అంతేకాదు, ఈ అంశంపై WTO దగ్గర సంప్రదింపులకు రావాలని భారత్‌కు చెప్పాలని చైనా కోరింది. భారతదేశం అనుసరిస్తున్న అన్యాయమైన పద్ధతులను వివరించి సరిదిద్దాలని ప్రపంచ వాణిజ్య సంస్థను చైనా అభ్యర్థించింది. భారతదేశ విధానాల వల్ల ప్రభావితమైన తమ దేశీయ పరిశ్రమల హక్కులు, ప్రయోజనాలను కాపాడటానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని కూడా చైనా ప్రభుత్వం తన ఫిర్యాదులో కోరింది.