కాంగ్రెస్‌ పార్టీలో చిచ్చు రగులుతున్న మేడారం జాతర పనులు



మంత్రి కొండా సురేఖకు మరో షాక్‌..


మేడారం జాతర పనులు ఆర్‌ అండ్‌ బీకి!


హైదరాబాద్‌ అక్టోబర్ 16 (ఎక్స్ ప్రెస్ న్యూస్  );: కాంగ్రెస్‌ పార్టీలో మేడారం జాతర పనుల   చిచ్చు రగులుతూనే ఉన్నది. తన శాఖలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి  అతిగా జోక్యం చేసుకుంటున్నాడని, మేడారం అభివృద్ధి పనులను ఆయన కంపెనీకి దక్కేలా చేసుకున్నాడని మంత్రి సురేఖ  ) ఆరోపించిన విషయం తెలిసిందే. పొంగులేటిపై కాండా దంపతులు పార్టీ అధిష్ఠానానికి ఫిర్యాదు కూడా చేశారు. అయితే మంత్రుల మధ్య వివాదాలకు కారణమంటూ కొండా సురేఖ ఓఎస్డీ సుమంత్‌ను ప్రభుత్వం ఉన్నఫలంగా తొలగించింది. అతనిని అరెస్టు చేసేందుకు ఏకంగా మంత్రి సురేఖ ఇంటికి అర్ధరాత్రి వేళ పోలీసులను పంపించింది. ఈ వ్యవహారం కొనసాగుతుండగానే దేవాదాయ శాఖ మంత్రికి రేవంత్‌ రెడ్డి సర్కార్‌ షాకిచ్చింది. మేడారం అభివృద్ధి పనులను ఆర్‌ అండ్‌ బీ శాఖకు అప్పగించింది. తక్షణమే రికార్డులు అప్పగించాలని మంత్రి కొండా సురేఖకు చెందిన దేవాదాయ శాఖకు ఆదేశాలు జారీచేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ఆదేశాలు జారీచేశారు.


నెలరోజులుగా రగులుతున్న రాజకీయ కుంపటి


నెల రోజులుగా వరంగల్‌ కేంద్రంగా జరుగుతున్న పరిణామాలు కాంగ్రెస్‌ పార్టీలో కాక పుట్టిస్తున్నాయి. మేడారం పనుల విషయంలో జిల్లా ఇన్‌చార్జ్‌ మంత్రి పొంగులేటికి, వరంగల్‌ జిల్లా మంత్రులు సురేఖ, సీతక్క మధ్య విభేదాలు పొడసూపాయి. అయితే పొంగులేటికి తోడుగా సీఎం రంగంలోకి దిగడంతో సీతక్క సైలెంటయ్యారు. కానీ, మంత్రి సురేఖ మాత్రం తన నిరసనను తెలియజేస్తూనే వచ్చారు. దేవాదాయ శాఖ మంత్రినైన తనకు తెలియకుండా టెండర్లు ఎలా ఖరారు చేస్తారంటూ ఆమె తన ఆగ్రహాన్ని బాహాటంగానే వ్యక్తపరిచారు. జిల్లా వ్యవహారాల్లో పొంగులేటి అతిజోక్యంపై విమర్శలు గుప్పించిన సురేఖ.. అధిష్ఠానానికీ ఫిర్యాదు చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో మంగళవారం జిల్లాలో మంత్రి పొంగులేటి పర్యటనకు, ఆమె దూరంగా ఉన్నారు. మరోవైపు సీఎం రేవంత్‌రెడ్డి బుధవారం వరంగల్‌ పర్యటనకు వచ్చారు. నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి తల్లి దశదిన కర్మకు ముఖ్యమంత్రి హాజరైనప్పటికీ, కొండా సురేఖ ఆ కార్యక్రమానికి దూరంగా ఉన్నారు. ఓరుగల్లు రాజకీయ రచ్చ కొనసాగుతుండగానే.. మంగళవారం సాయంత్రం సురేఖకు సమాచారం ఇవ్వకుండా ఆమె ఓఎస్డీని తొలగించడం, 24గంటలు గడవకముందే ఆరెస్టుకు సిద్ధమవడం.. అదీ ఏకంగా మంత్రి ఇంటిపైకే పోలీసులను పంపడం ఆసక్తికరంగా మారింది.


రేవంత్‌, పొంగులేటే చేస్తున్నరు..


‘మా ఇంటికి మఫ్టీలో పోలీసులు వచ్చిండ్రు. ఎందుకొచ్చిండ్రని అడిగితే సుమంత్‌పై  చాలా అభియోగాలున్నయని చెప్పిండ్రు. ఏమేం ఫిర్యాదులున్నాయో మాకు లిస్ట్‌ ఇవ్వండి అన్నం. ఆయన మా స్టాఫ్‌ కదా అని అడిగినం. వాళ్లు ఏం చెప్పకుండా వెళ్లిపోయిండ్రు. ప్రభుత్వంలో ఉండి కూడా ఇలాం టి పరిస్థితి ఫేస్‌ చేస్తున్నందుకు చాలా సిగ్గుగా ఉన్నది. బీసీ లేడీ అని కూడా చూడకుండా ఇలా చేయడం సిగ్గుచేటు. ఓఎస్డీని తొలగించినప్పుడు కనీసం అడగలేదు. అడిగి వాళ్ల ఇజ్జత్‌ ఎందుకు తీయాలని మేం కూడా అడగలేదు. కానీ ఈ రోజు వాళ్ల ఇజ్జత్‌ను వాళ్లే తీసుకున్నరు’ అంటూ మంత్రి సురేఖ కూతురు సుస్మిత ఆగ్రహం వ్యక్తంచేశారు. మాజీ ఓఎస్‌డీ సుమంత్‌ను అదుపులోకి తీసుకునేందుకు బుధవారం రాత్రి సురేఖ ఇంటికి మఫ్టీలో వెళ్లిన పోలీసులను అమె అడ్డుకున్నారు. అనంతరం సుష్మిత మీడియాతో మాట్లాడుతూ ‘దేవాదాయ శాఖలో ఒక టెండర్‌ పడింది. మంత్రి కొండా సురేఖకు తెలియకుండా పొంగులేటి తనకు కావాల్సిన వారికి ఇచ్చుకున్నరు. మావాళ్లు కూడా టెండర్‌ వేసిండ్రు. బిడ్‌ ఓపెన్‌ చేస్తే అది మా వాళ్లకు వచ్చింది. పొంగులేటి ఫోన్‌ చేసి టెండర్‌ విత్‌ డ్రా చేసుకోవాలని మా అమ్మను కోరిండ్రు. విత్‌డ్రా చేసుకోబోమని అమ్మ చెప్పారు. దీంతో ఆ టెండర్‌ రెవెన్యూ శాఖకు వెళ్లిపోయింది. ఇప్పుడు మళ్లీ టెండర్‌ రీకాల్‌ చేస్తున్నరు.పొంగులేటితో మాకు జరిగింది ఇదీ’ అని వివరించారు. ‘డెక్కన్‌ సిమెంట్‌తో ఇష్యూ ఎందుకు వచ్చిందో నాకు తెలియదు. సుమంత్‌ ఎక్స్‌టార్షన్‌ చేశారంటున్నారు. రోహిన్‌రెడ్డికి తెలియాలి.. రేవంత్‌రెడ్డికి తెలియాలి. రోహిన్‌రెడ్డిని మేం కలవలేదు. సీఎంవో ఆఫీసు నుంచి రోహిన్‌రెడ్డి వచ్చి సుమంత్‌కు కాల్‌ చేస్తే రోహిన్‌రెడ్డి ఆఫీసుకు సుమంత్‌ వెళ్లారు. కావాలంటే కెమెరాలు చెక్‌ చేసుకోవచ్చు. మంత్రి సురేఖ ప్రస్తుతం బయట ఉన్నారు. ఓఎస్‌డీ మంత్రితో బయటకు వెళ్లారు’ అని చెప్పారు. ‘రాహుల్‌ గాంధీ బీసీ నినాదం ఎత్తుకుంటే ఇక్కడ బీసీలను తొక్కాలని చూస్తున్నారు. మేం కింది నుంచి పైకి వచ్చినోళ్లం. రెడ్లందరూ ఒక్కటై మమ్మల్ని తొక్కాలని చూస్తున్నరు. డెక్కన్‌ సిమెంట్‌ విషయంలో వచ్చామని, ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి కంప్లయింట్‌ చేశారని పోలీసులు చెప్తున్నరు. ఉత్తమ్‌కు కాల్‌ చేస్తే నేను కంప్లయింట్‌ చేయలేదని చెప్పారు. పోలీసులు మఫ్టీలో వచ్చిండ్రు. ఎం దుకొచ్చిండ్రని అడిగితే సుమంత్‌పై చాలా అభియోగాలున్నయన్నరు. ఏమేం ఫిర్యాదులున్న యో లిస్ట్‌ ఇవ్వుమన్నం. ఏం చెప్పకుండా వెళ్లిపోయిండ్రు. ఓఎస్‌డీని తొలగించినప్పుడు కూ డా కనీసం అడగలేదు. అడిగి వాళ్ల ఇజ్జత్‌ ఎం దుకు తీయాలని మేం అడగలేదు. కానీ ఈ రోజు వాళ్ల ఇజ్జత్‌ను వారే తీసుకున్నరు.. ఇదం తా రేవంత్‌, ఉత్తమ్‌, పొంగులేటి, వేం నరేందర్‌రెడ్డి మా మీద కుట్ర చేస్తున్నరు. సీఎం సోదరులకు గన్‌మన్‌లతో భద్రత కల్పించినప్పుడు మాకెందుకివ్వరు? మమ్మల్ని హత్య చేయించేందుకేనా?’ అంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు.