
చెన్నయ్ అక్టోబర్ 15 (ఎక్స్ ప్రెస్ న్యూస్ );త్రిభాషా సూత్రంపై కేంద్రం, తమిళనాడు ప్రభుత్వం మధ్య విభేదాలు నెలకొన్న విషయం తెలిసిందే. ఈ విభేదాల నేపథ్యంలో విద్యా విధానాన్ని మార్చిన సీఎం స్టాలిన్ తాజాగా రాష్ట్రంలో హిందీ భాషకు వ్యతిరేకంగా కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.రాష్ట్రంలో హిందీ భాషను నిషేధించే లక్ష్యంతో అసెంబ్లీలో ఓ బిల్లు ప్రవేశపెట్టనున్నట్లు తెలిసింది. ఈ ప్రతిపాదిత చట్టంపై చర్చించేందుకు నిన్న రాత్రి న్యాయ నిపుణులు, ప్రభుత్వం మధ్య అత్యవసర సమావేశం జరిగినట్లు సమాచారం. రాష్ట్రం అంతటా హిందీ హోర్డింగ్‌లు, బోర్డులు, హిందీ సినిమాలు, హిందీ పాటలను నిషేధించే లక్ష్యంతో ఈ బిల్లును రూపొందించినట్లు సంబంధిత వర్గాలను ఊటంకిస్తూ జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. రాజ్యాంగానికి లోబడే దీన్ని రూపొందించినట్లు సమాచారం.తమిళనాడులో హిందీని బలవంతంగా రుద్దడానికి బీజేపీ ప్రయత్నిస్తోందని డీఎంకే సహా పలు పార్టీలు ఆరోపిస్తోన్న విషయం తెలిసిందే. తమిళనాడుపై బలవంతంగా హిందీ భాషను రుద్దడానికి వ్యతిరేకంగా ఆ రాష్ట్ర శాసనసభ ఇటీవలే ఓ తీర్మానం చేసింది. అధికార భాషలపై ఏర్పాటైన పార్లమెంటరీ కమిటీ నివేదికలోని సిఫారసులను అమలు చేయవద్దని ఆ తీర్మానంలో కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. సెప్టెంబర్ 9న రాష్ట్రపతికి ఈ కమిటీ నివేదించిన సిఫారసులు తమిళంసహా ఇతర రాష్ర్టాల భాషలకు, వాటిని మాట్లాడే ప్రజల ప్రయోజనాలకు విరుద్ధంగా ఉన్నాయంటూ సీఎం ఎంకే స్టాలిన్ ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఈ తీర్మానంతోపాటు హిందీయేతర భాషలు మాట్లాడే రాష్ర్టాలకు భారత తొలి ప్రధాని పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ ఇచ్చిన హామీకి పార్లమెంటరీ కమిటీ సిఫారసులు వ్యతిరేకంగా ఉన్నాయని ఆ తీర్మానంలో పేర్కొన్నారు. దీన్ని అసెంబ్లీ ఆమోదించింది.