కాలేయ మార్పిడికి వెస్సో 66,700 రూపాయల సహాయం

హైదరాబాద్ అక్టోబర్ 11 (ఎక్స్ ప్రెస్ న్యూస్ );ప్రకాశం జిల్లా, ఒంగోలు నివాసి అనిల్ కుమార్ పుదుపాకం(38) పెట్రోల్ బంక్‌ లలో యంత్రాల రిపేర్ పని చేస్తుండే వారు. దాదాపు సంవత్సరంన్నర క్రితం ఆయనకు కామెర్ల వ్యాధి సోకింది. ఆ సమస్య నుండి పూర్తిగా కోలుకోలేక పోయారు. చికిత్స నిమిత్తం అనేక ఆసుపత్రులు తిరిగిన అనంతరం, చివరికి ఆయన లివర్ పూర్తిగా చెడిపోయినదని తేలింది. దీనికి లివర్ మార్పిడి తప్పనిసరి అని వైద్యులు నిర్ధారించారు. ఆయన కు తల్లి, భార్య మరియు 9 ఏళ్ల కుమార్తె  ఉన్నారు. అనిల్ కుమార్ సంపాదనే కుటుంబానికి జీవనాధారం. సంపాదన కరువై, ప్రస్తుతం తల్లికి వచ్చే కొద్దిపాటి ప్రభుత్వ పెన్షన్ మీదే ఆధారపడి జీవిస్తున్నారు. ఇప్పటి వరకు స్నేహితులు మరియు బంధువుల నుండి అప్పుగా తీసుకున్న 4 లక్షల రూపాయలు వైద్యానికి ఖర్చు చేశారు. ప్రస్తుతం ఆయన చికిత్స పొందుతున్న విజయవాడ మణిపాల్ హాస్పిటల్లో లివర్ మార్పిడి సర్జరీ కి దాదాపు ₹24 లక్షలు ఖర్చు అవుతుందని అంచనా వేశారు. అదనంగా, ఔషధాలు మరియు ఆపరేషన్ అనంతర ఖర్చులు కూడా అనిల్ గారు భరించవలసి ఉంది.ఇప్పటివరకు వారు తమ పూర్వీకుల ఆస్తి విక్రయం మరియు ఆభరణాల అమ్మకం ద్వారా 24 లక్షలకు గాను సుమారు 22 లక్షలు సమకూర్చు కున్నారు. సాధారణంగా లివర్ దాతను పొందడం కష్టసాధ్యమైన మరియు సమయం పట్టే ప్రక్రియ. అయితే ఆయన భార్య నాగచంద్రిక స్వచ్ఛందం గా తన లివర్‌లో 60% భాగాన్ని భర్త ప్రాణ రక్షణ కోసం దానం చేయడానికి సిద్ధమయ్యారు. శస్త్ర చికిత్స నిమిత్తం, ఆర్ధిక సహాయం చేయవలసినది గా, అనిల్ కుమార్ వెస్సో ట్రస్ట్ ను ఆశ్రయించారు. వెస్సో ట్రస్టీలు గౌరవ దాతల సహకారంతో అనిల్ కుమార్ కు 66,700 రూపాయలు అందజేసారు.