గుజ‌రాత్‌లోని అహ్మ‌దాబాద్ వేదిక‌గా 2030 కామ‌న్‌వెల్త్ క్రీడ‌లు


విదేశాంగ మంత్రి ఎస్ జైశంక‌ర్ వెల్ల‌డించారు

న్యూఢిల్లీ అక్టోబర్ 16 (ఎక్స్ ప్రెస్ న్యూ స్): గుజ‌రాత్‌లోని అహ్మ‌దాబాద్ వేదిక‌గా 2030 కామ‌న్‌వెల్త్ క్రీడ‌లు జ‌ర‌గ‌నున్నాయి. విదేశాంగ మంత్రి ఎస్ జైశంక‌ర్ ఇవాళ ఈ విష‌యాన్ని వెల్ల‌డించారు. ఆయ‌న త‌న ఎక్స్ అకౌంట్ వేదిక‌గా ఈ అంశాన్ని ప్ర‌క‌టించారు. 2030లో జ‌రిగే కామ‌న్‌వెల్త్ క్రీడ‌ల‌కు భార‌త్ ఆతిథ్యం ఇవ్వ‌నున్న‌ట్లు మంత్రి స్ప‌ష్టం చేశారు. ఇది భార‌త దేశానికి, గుజ‌రాత్‌కు గ‌ర్వ‌కార‌ణ‌మ‌న్నారు. ప్ర‌పంచ స్థాయి మౌళిక స‌దుపాయాల క‌ల్ప‌న‌కు, క్రీడా టాలెంట్‌ను వెలికి తీసేందుకు ప్ర‌ధాని మోదీ విజ‌న్ నిద‌ర్శ‌నంగా ప‌నిచేస్తుంద‌న్నారు. అయితే 2036లో ఒలింపిక్స్ క్రీడ‌లు నిర్వ‌హించాల‌నుకుంటున్న భార‌త్‌కు.. కామ‌న్‌వెల్త్ క్రీడ‌ల నిర్వ‌హ‌ణ ఓ ప్లాట్‌ఫామ్‌గా నిలిచే అవ‌కాశం ఉన్న‌ది. న‌వంబ‌ర్ 26వ తేదీన స్కాట్‌లాండ్‌లోని గ్లాస్‌గోవ్‌లో జ‌ర‌గ‌నున్న జ‌న‌ర‌ల్ అసెంబ్లీ స‌మావేశాల్లో అహ్మ‌దాబాద్ అంశాన్ని ప‌రిశీలించ‌నున్నారు.భార‌త్ 2010లో ఢిల్లీ వేదిక‌గా కామ‌న్‌వెల్త్ క్రీడ‌ల‌ను నిర్వ‌హించింది. అయితే ఆ క్రీడ‌ల‌పై తీవ్ర ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. స‌రైన ప్లానింగ్ జ‌ర‌గ‌లేద‌న్నారు. మౌళిక స‌దుపాయాల క‌ల్ప‌న‌లో జాప్యం జ‌రిగింద‌న్నారు. అవినీతి ఆరోప‌ణ‌లు కూడా వ‌చ్చాయి.