మీ శ్రేయోభిలాషి..Part 16

(పార్ట్ 15 తరువాయి )
తప్పనిసరిగా ఆయన ఆపని చేయాల్సిందే. గత పదేళ్లలో దేశంలో ఎన్నో కుంభకోణాలు బయటకువచ్చాయి. వేలాదికోట్ల రూపాయల అక్రమసంపాదనలు బహిర్గతమయ్యాయి. ప్రతిదాంట్లో అవినీతి ప్రతిపనిలో అవినీతి ప్రతిఒక్కటి ఒక స్కాముగా మారిపోయింది. భారతదేశం అంటే స్కాములదేశంగా మారిపోయింది. భారతదేశం అంటే ప్రపంచదేశాలముందు విలువలు తగ్గిపోయాయి. ఇన్ని స్కాములు బయటికి వచ్చినా ఇన్ని వేలకోట్ల అవినీతి జరిగిందని అంటున్నా ఆశ్చర్యమేమిటంటే ఏ ఒక్క రాజకీయనాయకుడు గానీ ఏ ఒక్క అధికారిగాని పట్టుబడలేదు. శిక్షపడలేదు. అంటే ఈ దేశంలో ఇవన్నీ నిర్విరామంగా జరుగుతూనే ఉంటాయా? నాయకులు అధికారులు యధావిధిగా తమతమ ఉద్యోగాలు వృత్తులు చేసుకొంటూనే ఉంటారు. కేవలం పత్రికలూ ప్రసారమాధ్యమాలు మాత్రమే గగ్గోలు పెడుతూ ఉంటాయి. ప్రజలు వీటిని చూసిచూసి విసిగిపోయి వాటిగురించి తెలుసుకోవడమే మానేశారు. దున్నపోతుమీద వానపడితే దున్నపోతు ఏమన్నా పరుగెత్తి తలదాచుకొంటుందా? ఇక్కడ మనమూ అంతే! ఎవరో ఏదో అంటుంటారు. ప్రతిపక్షాలకు వేరేపని ఉండదుకాబట్టీ(అంటే అధికారంలో ఉండదుకాబట్టీ) అరుస్తూ ఉంటాయి. ఏనుగు వెళుతుంటే కుక్కలు ఎన్ని మొరగవు? అనే ధోరణిలో స్కాము స్వాములు జనం మధ్యలోనే నడయాడుతుంటారు. ప్రజలు పాపం! ఎంతో నిజాయితీగా ఆలోచిస్తుంటారు. ఈ స్కాములేమిటి? ఈ నల్లధనం ఏమిటీ? ఈ స్విస్ బ్యాన్కు లేమిటి?
 ఈ అరుపులు ఏమిటీ? ఈ గగ్గోలు ఏమిటీ? ఇదంతా ఏదో మాయలా ఉంది. ఇది స్వాతంత్ర్య భారతదేశమా లేక 14 లోకాలలో మరోలోకమా? ఇంత విచిత్రమైన లోకాన్ని మనం గతంలో చూడలేదు. భవిష్యత్తులో చూడబోము అయినా ఈ మాయాలోకంలో మనమెందుకు ఆలోచించాలి. సమయం దండగ! ఏదో ఇంత మత్తుగా ఉండే ద్రవాన్ని తాగేసి పాడుకొంటే పోలా? అనుకొంటూ సామాన్యుడు నిద్రలోకి జారుకొంటాడు. అధికారులేమో మీరు తాగుడుకు బానిసకావద్దు. ప్రతిఒక్కరు ఓటు హక్కును వినియోగించుకోవాలి అంటూ రోదిస్తూ ఉంటారు. ఎవరిని ఉద్దరించడానికి ఇవన్నీ. ఒక వ్యక్తికి ఎమ్మెల్యేగానో ఎంపీ గానో గెలిపిస్తే ఐదేళ్లు తిరిగేసరికి అతడు 50 కిలోల బరువు పెరిగి పెద్దపెద్ద జేబులు కుట్టించుకొని వాటిని నింపుకొని తిరిగి ఓట్లకోసం ప్రజలముందు శ్రీకృష్ణుడిలా అమాయకంగా నిలబడతాడు. అంతా చేసి ఏమీ చేయనట్లుగా అతని నటనా కౌశలం సామానితుడికి అర్థంగాక దిమ్మతిరిగి ఇంత తీర్థం పుచ్చుకొని నాకెందుకీగొడవ అంటూ ఏచెట్టు మొదట్లోనే హాయిగా విశ్రమిస్తాడు. (సశేషం)