మీ శ్రేయోభిలాషి - Part -6

Part -5 ( తరువాయి )
కాగా భారతదేశానికి ప్రధానమంత్రిగా నరేంద్రమోడీ ముందుగా ఏ రాష్ట్రానికి ఏమి చేయాలో సరైన ప్రణాలికను రూపొందించుకోవాలి. అన్ని ప్రాంతాలకు సమానమైన వాటాను అందిస్తూ రాష్ట్రాలను బలోపేతం చేస్తూ తద్వారా దేశాన్ని బలోపేతం చెయ్యాలి. అలాగే దేశంలో అంతర్గత బహిర్గత శత్రువులను నిర్మూలించాలి. దేశ వ్యాప్తంగా ఎన్నో రంగాలున్నాయి. అన్ని రంగాలను వృద్ధిలోకి తేవాలి.ప్రజలను ప్రజల అవసరాలను ఆశయాలను నెరవేర్చాలి.ఏ ఆశయంతో తనను ప్రజలు గెలిపించారో ఆ ఆశలను ఆశయాలను ఈ అయిదేళ్ల కాలంలో సాధ్యమైనంతవరకు నెరవేర్చాలి. తాను ముందుకు సాగుతున్న దారిలో అంతటా పూలే ఉంటాయని అనుకోవద్దు. ముళ్ళుకూడా ఉంటాయి. ఆ ముళ్ళను ఏరివేస్తూ ముందుకు సాగాలి.మంచి ఎక్కడవుందో చెడుకూడా అక్కడ ఉంటుంది. నిరుపేద అభ్యున్నతికి మనం అంకితం కావాలని మోడీజీ ఉద్ఘాటించారు. అంటే మనం చేయాల్సిన పని ఏమిటో ఈ అయిదేళ్ల అధికార కాలంలో ఎవరికి మనం సేవ చేయాలో ఆయనకు తెలుసు. అయితే ఒక్కడు తలచుకొంటే అనుకొన్న లక్ష్యం నెరవేరదు. మొత్తం అధికార యంత్రాన్గము ఒక్కతాటిపై ఒక్కబాటలో పయనించాలి.

అందరి ఆలోచన ఒక్కటి కావాలి.ఏసమయంలోనూ స్వార్థానికి తావు ఇవ్వకూడదు.జీవితంలో కనీసం ఒక్క ఐదేళ్లు ఈదేశంకోసం ఈప్రజలకోసం పనిచేయడం వలన వచ్చే నష్టమేమిలేదు. అందువల్ల నరేంద్రమోడీ ఆలోచనలను అధికారగణం అంతా అర్థం చేసుకోవాలి. అధికారంలో ఉన్న రాజకీయనాయకులు ప్రభుత్వ పథకాలను అమలుచేసే అధికారులు పై స్థాయినుంచి క్రింది స్థాయి వరకు ప్రతి ఒక్కరు చిత్త శుద్ధితో పనిచేయాలి. ఒక పల్లెటూరిలో ఉండే బీదవాడికి ఢిల్లీనుంచి వెలువడే ప్రభుత్వ పథకం అందితే అంతకు మించిన సంతోషం మరొకటి ఉండదు. ఆ మధ్య ఒక ప్రముఖ వ్యక్త్తి ఏమన్నాడంటే ఒక ప్రభుత్వ పథకం ఢిల్లీ నుంచి రాష్ట్రానికి రాష్ట్రం నుంచి జిల్లాలు మండలాలు గ్రామాలు చేరే సరికి దానివిలువ యాభై శాతం పైగా తగ్గిపోతుందిఅని. అంటే పథకాలు ప్రకటించడం ప్రభుత్వం వంతు. దానిని కాజేయడం మధ్యన ఉండే దళారుల వంతు అన్నమాట. అందుకే ప్రభుత్వాలు ఎన్ని పథకాలు ప్రవేశపెట్టినా అవి గ్రామస్థాయిలో బడుగు వర్గాలకు స్వాతంత్య్రం వచ్చినప్పటినుంచి సక్రమంగా చేరడం లేదనేది వాస్తవం. ఇలా ఉంటె దేశము ఎలా బాగుపడుతుంది.(సశేషం)