పార్ట్ - 3 తరువాయి
నేను 1947 కంటే ముందు పుట్టలేదు. ఒకవేళ పుట్టివుంటే భారత స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొని జైలుకు వెళ్ళేవాడిని. ఆ అవకాశం నాకు దక్కలేదు. అయితే ఇప్పుడు దేశంకోసం పనిచేసే అదృష్టం దక్కింది. దేశం మనకేమి ఇచ్చింది అనేది ప్రశ్నకాదు. దేశంకోసం ఇప్పుడు మనమేం చేయగలం అనేది ప్రశ్న. ఇకముందు జీవితమంతా దేశ సౌభాగ్యం కోసం పనిచేయడానికి నాకు అవకాశం లభించింది. కాబట్టి ఆపని చేస్తాను. అంటూ భారత ప్రధాన మంత్రి నరేంద్రమోడీ ముందుకు వచ్చారు. ఆయన మాటల్లో నిజాయితీ ఉంది. దేశానికి నేను సంపాదించిన వేతనంలో కొంత డబ్బును ఖర్చు చేయాలి అనే భావన ప్రతి భారతీయ పౌరుడి మదిలో ఏర్పడాలి. కోట్లాది రూపాయలు సంపాదిస్తూకూడా ఎలా పన్ను ఎగగొట్టాలి?ఎలా రాయితీ పొందాలి? అని ఆలోచిస్తున్నారు బడా బాబులు. ఒక సామాన్య ఉపాధ్యాయుడు సంవత్సరానికి నాలుగు లక్షల రూపాయలు వేతన రూపంలో సంపాదిస్తే అందులో పది శాతం వ్యక్తిగత పన్ను క్రింద ప్రభుత్వానికి జమచేస్తున్నారు. అదే ఒక ఎమ్మెల్యేనో ఎంపీనో సంవత్సరానికి పది నుంచి పదిహేను లక్షలు వేతనం ఇతర భత్యాల రూపంలో పొందుతున్నా ఒక్క రూపాయి కూడా వ్యక్తిగతపన్ను కట్టాల్సిన అవసరం లేదు. ఒక పారిశ్రామిక వేత్త తన పరిశ్రమ ద్వారా కోట్లాది రూపాయలు లాభము పొందుతున్నా తప్పుడు లెక్కలు చూపి ప్రభుత్వానికి చెల్లించాల్సిన పన్నులు ఎగగొడుతున్నారు. వ్యాపారవేత్తలు ఇదే పని చేస్తున్నారు. ప్రభుత్వం మాత్రం సామాన్యుడి మీద పన్నుల భారం మోపుతూనే ఉంటుంది. డీజిల్ పెట్రోల్ గ్యాస్ ధరలు పెంచి కోట్లాది రూపాయలను పన్నుల రూపంలో వసూలు చేస్తుంది. రాజకీయనాయకులకు మాత్రం ఈ పన్నులు ఏవి వర్తించవు.
ఒక శాసన సభ్యుడొ లేక పార్లమెంట్ సభ్యుడొ అయిదేళ్ల క్రితం జరిగిన ఎన్నికల్లో తమ సంపాదన యాభై లక్షలు లెక్కల్లో చూయిస్తే ఐదేళ్లుగడిచి మళ్ళీ ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు పదికోట్ల ఆస్తులను చూపుతారు. అతడి సంపాదన అంతలా ఎలా పెరిగింది? ఈ విషయంలో ప్రతిఒక్కరు ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు కోట్ల రూపాయలు ఖర్చు చేసినా కేవలం లక్షల్లోనే తమ ఖర్చుల వివరాలు ఎన్నికల కమీషన్కు చూపుతున్నారు. అధికారులకు ప్రజలకు తెలియదా వారెంత ఖర్చు పెట్టారో? ఎవరికి వారు కాకి లెక్కలను నమ్ముతారు తప్ప వాస్తవ విషయాల జోలికిపోరు. భారత దేశంలో ఇలాంటి చిత్ర విచిత్ర లీలలు కోకొల్లలు. ఎక్కడా నిజాయితీ ఉండదు. ఎక్కడా జవాబుదారీతనం ఉండదు. దొంగలెక్కలకు పాలబడవలసిన ఖర్మ ఎందుకు వారికి? మనిషన్నాకా నిజాయితీగా బ్రతుకుదామన్న ఇంగిత జ్ఞానం మన రాజకీయ నాయకులకు ఎందుకులేదు?
పాలించేవాడు ఎప్పుడు శ్రేయోభిలాషుడుగా ఉండాలి. అప్పుడే ప్రజలు సుఖంగా సంతోషంగా ఉండగలుగుతారు. అలనాడు శ్రీరాముడు పరిపాలించిన రామరాజ్యంలో ప్రజల కష్ట సుఖాలు తీర్చిన తర్వాతనే తాను సేదతీరేవాడు రాముడు. మన దేశాన్ని పరిపాలించిన ఎందరో రాజన్యులు కూడా జనరంజకంగానే పరిపాలన సాగించారు. గత చరిత్రకు సంబంధించిన ఎన్నో రాజ్యాలు రాజులు వారిపరిపాలనా తీరులను మనం పుస్తకాలలో చదువుతూ ఉన్నాం. ఇంత చరిత్ర తెలిసికూడా మనపాలకులు కంటిలో ముళ్ళు గుచ్చినట్లుగా పరిపాలన సాగిస్తున్నారు. స్వార్థం ఆశ్రీత పక్షపాతం నేను అన్న అహంభావం వారి పాలనలో అడుగడుగునా కనిపిస్తూ ఉంటుంది. తమను పొగడ్తలతో పొగిడే వందిమాగధులకు కావలసింది ఇచ్చి ప్రజలకు బాధలను పంచుతున్నారు.