నేటి సమాజంలో నిజాయితీగా ఉన్నవారికి లంచం ఇవ్వకుండా పనికానప్పుడు తీవ్ర ఇబ్భది ఏర్పడుతుంది. లంచం తీసుకొనే అధికారి ఎదుటివ్యక్తి ఎలాంటివాడో తెలుసుకోడు.నాకెందుకు అంటాడు. నీవు లంచం ఇస్తే నీ పని పూర్తి అవుతుంది. లేదా పెండింగులో ఉంటుంది అంటాడు. అంటే సమాజంలో ఏ వ్యవస్థ అయినా మనం ప్రారంభించిందే.అది ఎక్కడో పైనుంచి ఊడిపడలేదు.కాబట్టి రోడ్డుమీద పడిఉన్న రాళ్లను మనం తీయడం ఆరంభిస్తే ఇతరులుకూడా తలా ఒక చేయి వేస్తారు. ఇలాంటి ధోరణి సమాజంలో పెరగాలి. నేనెందుకు చేయాలి అనేబదులు నేనే ఈపని చేయాలి అనే ధోరణిలోకి మనుషుల మనస్సులు మారాలి. ఇక వ్యవస్థను మార్చాలి అని మనం నడుం బిగిస్తే మనజీవితం ముగిసిపోతుంది. కానీ వ్యవస్థ మారదు. వేళ్ళూనుకొనిపోయిన ఈ జాడ్యాలను రూపుమాపడానికి ఒకేఒక్కదారి నేటి బాలబాలికలకు స్వచ్ఛమైన విద్యను అందించడం. పూర్వకాలంలో ఎక్కడో గ్రామాలకు పట్టణాలకు సుదూరంగా ఉన్న ప్రాంతంలో మునీశ్వరులు యతీశ్వరుల గురుకులాలకు రాజులు తమపిల్లలను పంపి విద్య నేర్పించేవారు.
అక్కడ ఈ సమాజపు కుళ్ళు అసలు ఉండదు. పూర్తిగా స్వచ్ఛమైన విద్యను అక్కడ వారు నేర్చుకొనేవారు. ఇప్పుడు జరగాల్సింది అదే. మనదేశంలో బాలబాలికలకు అందించే విద్య ఎలాంటి అరమరికలు లేకుండా దేశం మొత్తానికి ఒకేరకమైన విద్య ఒకే తరహాలో అందించాలి. వారిలో దేశభక్తిని పాదుకొల్పాలి. అలా విద్య నేర్చుకొని వచ్చే విద్యార్థులతో ఒక నూతన సమ సమాజం రూపుదిద్దుకొంటుంది. నాయకులు కేవలం అనుకొంటే సరిపోదు. అందుకు నడుం బిగించాలి. ముందుకుకదలాలి. సమాజాన్ని సంస్కరించాలనుకొన్నప్పుడు సంఘర్షణ తప్పదు. సంఘర్షణలోంచే నిప్పులాంటి నిజాలు బయటకు వస్తాయి. నరేంద్రమోడీగారు అనుకొంటూ ఉండవచ్చు నేను నిజాయితీగా ఉంటాను కాబట్టీ అందరూ అలాగే ఉండాలి. నేను నిస్వార్థంగా ఉంటాను కాబట్టీ అందరూ నిస్వార్థంగా ఉండాలి. ఈ సమాజంలో అలా ఎప్పటికీ కుదరదు. నేను మీ శ్రేయోభిలాషిని కాబట్టీ అందరూ అలాగే ఉండాలి కానీ కుదరదు. మన పరిస్థితి వేరు. ఇతరుల పరిస్థితి వేరు. మీరు హాయిగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉన్నారుకాబట్టీ మీరు సంగీతాన్ని చక్కగా ఆస్వాదిస్తారు. అదే ఇతరులు ఎన్నో ఇబ్బందుల్లో ఉన్నారు. సంగీతం వారిలో కర్ణ కట్టొరంగా ఉంటుంది. అందువల్ల ఎదుటివారి మనస్తత్వాన్ని గుర్తించాలి.(సశేషం)