ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యదేశం భారతదేశం. అలాంటి భారతదేశ రాజకీయ చిత్ర పటాన్ని పరిశీలిస్తే అతి సామాన్యునికి కూడా సులువుగా అర్థమయ్యేది ఒక్కటే. రాజకీయనాయకులంతా తమను తాము రక్షించుకోవడానికి సందర్భాలలో డబ్బు మిగిలించుకోవడానికి ఇతరులమీద జులుం ప్రదర్శించడానికి హద్దులు మీరడానికి చట్టాలను ఉల్లంఘించి దర్జాగా ఉండడానికి పదిమందిలో తామే గొప్ప అనిపించుకోవడానికి విలాసవంతమైన జీవితాన్ని గడపడానికి ప్రభుత్వ సొమ్ముతో తమ కోరికలు తీర్చుకోవడానికి ....ఇలా ఎన్నింటికో రాజకీయాన్ని యథేచ్ఛగా వాడుకొంటున్నారు.పరమపద సోపానంలో మాదిరిగా టప టపా మెట్లెక్కి పైన ఎక్కి కూర్చుంటున్నారు. పదవి ఉన్నంతకాలం అధికారాన్ని అనుభవిస్తూ పదవి ఉడగానే ఆ పదవి తాలూకు చూరును పట్టుకొని వేలాడుతూ ఉంటారు. ఇలాంటి పరిస్థితి దేశమంతటావుంది.వేలాదిమంది రాజకీయనాయకులు ఇలా అన్ని రాష్ట్రాలలో ఉన్నారు. వీరంతా దేశాన్ని దేశ ఖజానాను తమ ఇస్టార్రాజ్యాంగా ఉపయోగించుకొంటూ దేశ ప్రగతికి ప్రతిబంధకాలుగా మారుతున్నారు. ఈ విషయంలో కాగ్ అనే ప్రభుత్వ సంస్థ ప్రతి సంవత్సరము అన్ని రాష్ట్రాల ఖర్చులను తరచి చూసి అనవసర ఖర్చుల గురించి సమగ్రమైన నివేదికలను అందిస్తుంది. అందులో చూస్తే ఎన్నో అవకతవకలు ఉంటాయి.
ఒకటికాదు... రెండుకాదు.... ఎన్నో ఏళ్లుగా ఈ పరిస్థితి కొనసాగుతూ వస్తోంది. దోపిడీ యధావిధిగా జరుగుతూనేఉంది. వాస్తవాలను పరిశీలిస్తే ఒక బీదవాడు ఈ దేశంలో ఒక మధ్యతరగతి వ్యక్తిగా ఎదగడానికి కనీసం పదిహేను సంవత్సరాలు పడుతుంది అని అనుకొందాం. అంటే పదిహేను సంవత్సరాల కాలంలో ఒకపూటకూడా ఇబ్బందికరంగా ఆహారం సమకూర్చుకోగలిగే బీదవాడు తానూ కృషిచేసి రెండుపూటలా ఎలాంటి ఇబ్బంది లేకుండా తినగలిగే మధ్యతరగతి స్థాయికి చేరుకోగలదన్నమాట. అయితే ఈ దేశానికి 1947 లో స్వాతంత్య్రం వచ్చినతరువాత పదేనుసంవత్సరాల కాలంలో బీదరికంలో ఉండే వారంతా ఆ స్థాయినిదాటి మధ్యతరగతి స్థాయికి చేరుకోవాలి. కానీ 1947 నుంచి 2014 వరకు దాదాపు 65 సంవత్సరాల వరకు కూడా బీదవాళ్లు బీదవాళ్లు గానే ఉన్నారు. ధనవంతులు మాత్రం కోట్లాధిపతులుగా అయిపోయారు. ఇది వాస్తవానికి వ్యతిరేకధోరణిలో పెరుగుదల అన్నమాట.ఈ దేశపాలకులు మాత్రం గరీబీ హటావో అని అంటుంటారు. దాని అర్థం ఏమిటో... అది ఎవరు చెప్పగలరో ఎవరికి తెలియదు.