పంట రుణమాఫీకి ఎదురుచూపులు

పాత పద్ధతేనా లేక ఒకే విడతలోనా ?
అమలుపై ఇప్పటివరకు స్పష్టత కరవు
ఎన్నికలొస్తే ఆటంకం కావచ్చని ఆందోళన
రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే పంట రుణమాఫీ కోసం రైతులు ఎదురుచూస్తున్నారు. ఎన్నికల సమయంలో పంట రుణాలు ఉన్న రైతులందరికీ రూ. లక్ష వరకు మాఫీ చేస్తామని సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ అమలుపై ఇప్పటివరకు స్పష్టత రాకపోవటంపై ఆందోళన వ్యక్తమవుతోంది.
పాత పద్ధతినేలోనే నాలుగు దఫాలుగా రుణమాఫీ చేస్తే పెద్దగా ఒరిగేదేమీ ఉండదన్న వాదన వినిపిస్తోంది. త్వరలోనే పార్లమెంట్ ఎన్నికలు ఉన్నందున అంతలోపే రుణమాఫీపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది.
జోగులాంబ గద్వాల జిల్లాలోని బ్యాంకుల్లో ఉన్న వివరాల ప్రకారం 80 శాతం మంది రైతుల పంటరుణం లక్షలోపే ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ వివరాలను ప్రభుత్వం బ్యాంకర్ల నుంచి సేకరించినట్లు సమాచారం. జిల్లాలో 1.42 లక్షల మంది వరకు పట్టాదారులైన రైతులు ఉన్నారు. ఇందులో 1.26 లక్షల మందికి కొత్త పట్టాదారు పాసు పుస్తకాలు అందాయి. ఇంకా 18వేల మందికి పాస్తు పుస్తకాలు అందాల్సి ఉంది. వివిధ కారణాలతో వారికి అందలేదు. గత 2015లో రుణమాఫీ పొందిన రైతుల సంఖ్య 81,520 వరకు ఉంది. జిల్లా మొత్తంలో నాలుగు విడుతలు కలిపి రుణమాపీ సొమ్ము దాదాపు రూ. 367.25 కోట్ల సొమ్ము రైతులకు అందింది. నాలుగు విడుతలుగా రుణమాఫీ సొమ్ము అందటంపై అప్పట్లో రైతుల నుంచి అసంతృప్తి వ్యక్తమైంది. ఈసారి ఒకే దఫా పంట రుణమాఫీ అందిస్తామని ప్రకటన చేసినా ఇప్పటివరకు అమలుపై స్పష్టత రాలేదు. ఈసారి జిల్లాలో పంటరుణం తీసుకున్న రైతుల సంఖ్య కూడా ఇంకా పెరిగే అవకాశం ఉంది. తీసుకున్న రుణ మొత్తం కూడా గతం కంటే కొంత ఎక్కవగానే ఉండే అవకాశం ఉందని బ్యాంకర్లు అంటున్నారు. ఏటా ఖరీఫ్‌లో రైతులకు బ్యాంకులు పంటరుణాలు ఇవ్వటమో లేదా పునరుద్ధరణో చేస్తుంటాయి. వరుసగా పార్లమెంట్, పురపాలిక, మండల, జిల్లా పరిషత్, సహకార సంఘాల ఎన్నికలు కూడా రానున్న నేపథ్యంలో ప్రభుత్వం త్వరగా నిర్ణయం తీసుకోవాలని రైతులు కోరుతున్నారు