(ఆయుధం న్యూస్ ) కృష్ణాతీరం ఆధ్యాత్మిక ఆలయాలకు పెట్టింది పేరు. ఉమ్మడి జిల్లాలో నది వెంట ఎన్నో పుణ్యక్షేత్రాలు వెలశాయి. కొల్లాపూర్ నియోజకవర్గంలో పంచ క్షేత్రాలు ఎంతో పేరుగాంచాయి. కాలక్రమేణా ఆ పంచ క్షేత్రాల పేర్లపైనే గ్రామాలు వెలశాయి. వాటిలో కొల్లాపూర్ మండలంలో సోమశిల, పెంట్లవెల్లి మండలంలో మల్లేశ్వరం ప్రత్యేక పంచాయతీలుగా ఏర్పడ్డాయి. వీటితోపాటు మిగిలిన మూడు గ్రామాలు కూడ పుణ్యక్షేత్రాల పేరుతోనే ఉన్నాయి.
ఇదీ చరిత్ర..: ద్వాపర యుగంలో పాండవులు అరణ్యవాసం చేస్తూ కృష్ణా తీర ప్రాంతానికి చేరుకున్నారట. కొల్లాపూర్ సమీపంలోని సప్తనదుల సంగమ ప్రాంతంలో శివలింగాలను ప్రతిష్ఠించాలని నిర్ణయించి, భీముడు కాశీకి వెళ్లి శివలింగాలు తెస్తుండగా.. ముహూర్త సమయం దాటి పోతుండడంతో అక్కడే ఉన్న వేపచెట్టును నరికి మొద్దుతో శివలింగం తయారు చేసి ధర్మరాజు ప్రతిష్ఠించారట. ఆ తర్వాత వచ్చిన భీముడు ఆగ్రహంతో తాను తెచ్చిన శివలింగాలను కృష్ణాతీరంలో విసిరేయగా అవి అయిదు ప్రాంతాల్లో పడ్డాయని, ఆ ప్రాంతాలు పంచ క్షేత్రాలుగా వెలిశాయని పురాణాల్లో ప్రతీతి. అప్పట్లో ఏర్పడిన శివలింగాల ప్రాంతాలు సంగమేశ్వరం, కపిలేశ్వరం, సిద్ధేశ్వరం, సోమేశ్వరం, మల్లేశ్వరం శైవ క్షేత్రాలుగా వెలిశాయి. కాలక్రమంలో ఈ క్షేత్రాల పేర్లపై ఊళ్లు ఏర్పడ్డాయి. శ్రీశైలం ప్రాజెక్టు నిర్మాణంలో ఈ గ్రామాలు ముంపునకు గురికావడంతో కర్నూల్ జిల్లా వైపు కపిలేశ్వరం, సిద్ధేశ్వరం, సంగమేశ్వరం గ్రామాల ప్రజలు తరలిపోగా.. సోమశిల, మల్లేశ్వరం గ్రామాల ప్రజలు కొల్లాపూర్ తీర ప్రాంతానికి తరలివచ్చారు. క్షేత్రాలను ఆయా ప్రాంతాలకు తరలించగా, సంగమేశ్వర క్షేత్రం నేటికీ నదిలోనే ఉంది.
ప్రత్యేక పంచాయతీలు : స్వాతంత్రం వచ్చిన మొదట్లో మల్లేశ్వరం, సోమశిల గ్రామాలు ఒకటే పంచాయతీగా ఉండేవి. మల్లేశ్వరం గ్రామపంచాయతీ పరిధిలో సోమశిల ఉండగా.. 1980లో శ్రీశైలం ప్రాజెక్టు నిర్మాణంతో ఆయా గ్రామాల ప్రజలు ఎగువ మిట్టపైకి తరలివచ్చారు. దీంతో 1988లో సోమశిల ప్రత్యేక పంచాయతీగా ఏర్పడింది. మొదటి సర్పంచిగా అప్పట్లో మహ్మద్ షరీఫ్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకొని కృష్ణాతీరంలో ఆదర్శంగా నిలిచారు.
కొత్త మండలాల ఏర్పాటుతో ప్రస్తుతం మల్లేశ్వరం పెంట్లవెల్లి మండలం పరిధిలోకి, సోమశిల కొల్లాపూర్ మండల పరిధిలోకి వచ్చాయి. ఆ రెండు గ్రామ పంచాయతీలకు కూడ ఈ నెల 30వ తేదీ మూడో విడతలో ఎన్నికలు జరగనున్నాయి.