బీసీ రిజర్వేషన్లపై అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం
న్యాయ సలహాలు స్వీకరిస్తున్న ఎన్నికల సంఘం
హైకోర్టు తీర్పుపై అధికారులతో చర్చించిన ముఖ్యమంత్రి
ఆయుధం న్యూస్ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకోలేదని తెలంగాణ హైకోర్టు చెప్పినప్పటికీ 42 శాతం రిజర్వేషన్‌ల అమలుపై స్టే ఇచ్చిన నేపథ్యంలో సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేయడానికే ప్రభుత్వం నిర్ణయించింది. సీఎం రేవంత్‌రెడ్డి శనివారం అధికారులతో సమావేశం నిర్వహించి హైకోర్టు తీర్పుపై చర్చలు జరిపారు.
బీసీ రిజర్వేషన్‌లు అమలు చేయాలంటే సుప్రీంకోర్టును ఆశ్రయించడం తప్ప మరో దారి లేదన్న అభిప్రాయం వ్యక్తం కావడంతో స్పెషల్ లీవ్ పిటిషన్ (ఎస్‌ఎల్పీ) దాఖలు చేయడానికి చర్యలు తీసుకోవాలంటూ అధికారులకు ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్‌లతో ఎన్నికలకు వెళ్లాలన్న స్థిర నిశ్చయంతో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం, సుప్రీంకోర్టులో పటిష్ఠ వాదనలు వినిపించడానికి రంగం సిద్ధం చేస్తోంది. స్పెషల్ లీవ్ పిటిషన్ రూపకల్పనను సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదుల ద్వారానే చేపట్టాలని నిర్ణయించింది.
పత్రాలను దిల్లీకి పంపిన ప్రభుత్వం :
బీసీలకు 42 శాతం రిజర్వేషన్‌లు కల్పించే ముందు ట్రిపుల్ టెస్ట్ నిర్వహించాలన్న సుప్రీంకోర్టు తీర్పు ప్రకారమే ప్రత్యేక కమిషన్‌ను ఏర్పాటు చేసి, జనాభా లెక్కలను సేకరించి రిజర్వేషన్‌లు కల్పించామన్న వాదనను బలంగా ముందుకు తీసుకెళ్లనుంది. రిజర్వేషన్లు 50 శాతం మించరాదన్న అంశం మినహాయింపులపై దృష్టి సారించనుంది. ఈ మేరకు అడ్వొకేట్ జనరల్ ఎ.సుదర్శన్‌రెడ్డితో పాటు సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదుల ద్వారా స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేయడానికి సన్నాహాలు పూర్తి చేసింది. ఇప్పటికే తీర్పు ప్రతితో పాటు అవసరమైన పత్రాలను దిల్లీకి పంపినట్లు విశ్వసనీయ సమాచారం. సుప్రీంకోర్టు నిర్ణయంపైనే తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ ఆధారపడి ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
న్యాయ సలహాలు స్వీకరిస్తున్న రాష్ట్ర ఎన్నికల సంఘం :
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్‌లపై హైకోర్టు తీర్పు వెలువరించిన నేపథ్యంలో ఏం చేయాలన్న విషయంపై తెలంగాణ ఎన్నికల సంఘం న్యాయ నిపుణులను సంప్రదిస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్‌లు కల్పిస్తూ జీవో 9, తదనంతర ఎన్నికల ప్రక్రియ నిమిత్తం జారీ చేసిన 41, 42 జీవోల అమలును మాత్రమే నిలిపివేస్తున్నట్లు హైకోర్టు జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వుల్లో స్పష్టంగా ఉంది.
అంతేకాకుండా ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకోవడం లేదని న్యాయస్థానం తేల్చి చెప్పింది. 50 శాతం రిజర్వేషన్‌లు మించకుండా మిగిలిన సీట్లను దామాషా పద్ధతిలో ఓపెన్ కేటగిరీ కింద పరిగణనలోకి తీసుకుని ఎన్నికలు నిర్వహించుకోవచ్చని తెలిపింది. అయినా కూడా రిజర్వేషన్‌ల అమలుపై మళ్లీ సందిగ్ధత మొదలవుతోంది. ఇప్పటికే 42 శాతం రిజర్వేషన్‌ల ప్రాతిపదికన స్థానిక సంస్థల్లో పంచాయతీలు, వార్డుల కేటాయింపు ప్రక్రియ జరిగింది. ఇలా విభజించాల్సింది రాష్ట్ర ప్రభుత్వమే.
న్యాయ నిపుణులతో సంప్రదింపులు :
వార్డుల విభజన జరిగాక ఎన్నికల సంఘానికి ప్రభుత్వం పంపిన వివరాల ఆధారంగా స్థానిక ఎన్నికలు నిర్వహిస్తుంది. అయితే ఇక్కడ ఎన్నికల నోటిఫికేషన్‌లో జోక్యం చేసుకోలేదని హైకోర్టు స్పష్టత ఇచ్చినప్పటికీ, ఎన్నికల సంఘానికి ముందుకెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. అందువల్ల ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఏం చర్యలు చేపట్టాలన్న దానిపై, అనుసరించాల్సిన విధానంపై రాష్ట్ర ఎన్నికల సంఘం పలువురు న్యాయ నిపుణులతో సంప్రదింపులు జరుపుతోంది. న్యాయ నిపుణుల నుంచి అభిప్రాయాలు సేకరించిన అనంతరం స్థానిక సంస్థల ఎన్నికలపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.