స‌మాజ్‌వాదీ పార్టీ అధ్య‌క్షుడు అఖిలేశ్ యాద‌వ్ ఫేస్‌బుక్ అకౌంట్‌ను స‌స్పెండ్

న్యూఢిల్లీ  అక్టోబర్ 11 (ఎక్స్ ప్రెస్ న్యూస్ _);: స‌మాజ్‌వాదీ పార్టీ అధ్య‌క్షుడు అఖిలేశ్ యాద‌వ్  ఫేస్‌బుక్ అకౌంట్‌ను స‌స్పెండ్ చేశారు. దీంతో ఆ పార్టీ తీవ్ర విమ‌ర్శ‌లు చేసింది. అఖిలేశ్ యాద‌వ్ ఫేస్‌బుక్ అకౌంట్‌కు 80 ల‌క్ష‌ల మంది ఫాలోవ‌ర్లు ఉన్నారు. శుక్ర‌వారం సాయంత్రం 6 గంట‌ల స‌మ‌యంలో ఆ పేజీ ఆఫ్‌లైన్‌లోకి వెళ్లింది. యూపీ మాజీ సీఎం అఖిలేశ్‌.. ఎక్కువ‌గా త‌న ఫేస్‌బుక్ పేజీలో రాజ‌కీయ అభిప్రాయాల‌ను వెల్ల‌డిస్తారు. ప్ర‌భుత్వాన్ని విమ‌ర్శిస్తూ ఆయ‌న ఎఫ్‌బీలో రాసేవారు. ఆ అకౌంట్ ద్వారా ఆయ‌న త‌న మ‌ద్ద‌తుదారుల‌తో నిత్యం ట‌చ్‌లో ఉండేవారు.ఫేస్‌బుక్ అకౌంట్ స‌స్పెండ్ అయిన అంశంపై ఎస్పీ ప్ర‌తినిధి ఫ‌క్రుల్ హ‌స‌న్ చాంద్ స్పందించారు. ప్ర‌జా వ్య‌తిరేక‌త‌ను అణిచివేసేందుకు బీజేపీ స‌ర్కారు ప్ర‌య‌త్నాలు చేస్తుంద‌ని విమ‌ర్శించారు. సోష‌ల్ మీడియా ఎక్స్‌లో ఆయ‌న పోస్టు చేశారు. దేశంలోనే అతిపెద్ద మూడ‌వ పార్టీ స‌మాజ్‌వాదీ పార్టీ అని, ఆ పార్టీకి చెందిన పేజీని స‌స్పెండ్ చేయ‌డ‌మంటే, ఇది నేరుగా ప్ర‌జాస్వామ్యంపై దాడి అన్నారు. బీజేపీ అప్ర‌క‌టిత ఎమ‌ర్జెన్సీ అమ‌లు చేస్తోంద‌న్నారు. ప్ర‌తిప‌క్ష స్వ‌రాన్ని నొక్కిపెడుతోంద‌న్నారు. ప్ర‌జా వ్య‌తిరేక బీజేపీ విధానాల‌కు వ్య‌తిరేకంగా త‌మ పోరాటం ఆగ‌దు అని ఆయ‌న అన్నారు.అకౌంట్ స‌స్పెన్ష‌న్ అంశంలో ఫేస్‌బుక్ పేరెంట్ కంపెనీ మెటా మాత్రం ఇప్ప‌టి వ‌ర‌కు అధికారిక ప్ర‌క‌ట‌న చేయ‌లేదు.