ఫ్రెండ్లీ పోలీసు అని చెబుతూ.. వైద్యురాలి హత్య కేసులో పోలీసులు వ్యవహరించిన తీరుపై తీవ్ర విమర్శలు ఎదురవుతున్నాయి. తమ అమ్మాయి కనిపించడం లేదని ఫిర్యాదు చేసేందుకు వెళితే తమ పరిధి కాదంటూ స్టేషన్ల చుట్టూ తిప్పారని వైద్యురాలి తల్లిదండ్రులు వాపోయారు. స్టేషన్‌కు వెళితే ‘మీ అమ్మాయికి వేరే ఏదో ఉంది. లవర్‌తో లేచిపోయిందేమో, ఆసుపత్రికి వెళ్లిందో.. వేరే వాళ్లతో వెళ్లిందో’’ అని చెడుగా మాట్లాడారని తల్లి వాపోయారు. ఆసుపత్రికి వెళ్లిందో లేదో ఫోన్ చేయాలని సూచించారని అన్నారు. రాత్రి 11:30 కి ఎస్‌ఐ ఇద్దరు కానిస్టేబుళ్లతో వచ్చి సీసీ కెమెరాలు చూస్తూ కాలం గడిపారని, మరింత బలగాన్ని సమీకరించి, ప్రధాన రహదారులన్నీ దిగ్బంధించి వెతికి ఉంటే తమ కుమార్తె బతికి ఉండేదని పేర్కొన్నారు. హత్య జరిగిన తర్వాత 10 టీమ్‌లు పంపామని చెబుతున్నారని తెలిపారు. వైద్యురాలి హంతకులను ఉరితీయాలని కోరారు. ‘నా కుమార్తె అమాయకురాలు. ఆమెను చంపినవాళ్లను నిలువునా తగులబెట్టాలి’ అని తల్లి అన్నారు. ‘స్టేషన్ల మధ్య తిరగడంతోనే సమయం వృథా అయింది. లేకపోతే అక్క ప్రాణాలతోనైనా దక్కేది’ అని వైద్యురాలి చెల్లెలు వాపోయింది.
టోల్‌ప్లాజా సమీపంలో.. గదిలో అత్యాచారానికి యత్నం
‘‘వైద్యురాలిని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకువెళ్లిన నిందితులు ఆమెపై అక్కడే అత్యాచారం జరిపి హత్య చేశారు’’ ఇది పోలీసులు చెప్పిన విషయం. అయితే పోలీసుల విచారణలో బయటపడని మరికొన్ని విషయాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. ఆమెను టోల్‌ప్లాజా సమీపంలోని ఓ గదిలోకి తీసుకువెళ్లేందుకు నిందితులు ప్రయత్నించారు. గదికి ఉన్న కిటికీని రాళ్లతో పగులగొట్టడానికి ప్రయత్నించారు. కిటికీలు పగలకపోవడంతో వెనుదిరిగారు. అయితే వారికి గదిలో ఓ వాచ్‌మాన్ పడుకున్నాడన్న విషయం తెలియదు. వాచ్‌మాన్ పార్‌సకు ఈ శబ్దాలు వినిపించినప్పటికీ భయపడి తలుపులు తీయలేదు..