పంచాయితీలు పెట్టకోవలసిన అవసరం లేదు - కెసిఆర్

హైదరాబాద్: గోదావరిలో మూడు వేల టిఎంసిలు, కృష్ణాలో 1200 టిఎంసిల లభ్యత ఉందని ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు తెలిపారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ… రెండు నదుల్లో కలిపి నాలుగు వేల టిఎంసిలకు పైగా నీరు ఉందని చెప్పారు. ఈ నీటిని సద్వినియోగం చేసుకుంటే రెండు రాష్ట్రాల్లో ప్రతి ఎకరానికి నీరు ఇవ్వొచ్చన్నారు. తెలుగు రాష్ట్రాలు పంచాయితీలు పెట్టకోవలసిన అవసరం లేదని పేర్కొన్నారు. ఇదే విషయాన్ని ఎపి సిఎం చంద్రబాబు నాయుడు కూడా చెప్పానన్నారు. ఇందుకోసం ప్రాజెక్టులు రీ డిజైన్ చేశామని వెల్లడించారు.
గోదావరి జలాలతో తెలంగాణకు ఎక్కువ మేలు జరుగుతోందని స్పష్టం చేశారు. పాలమూరు జిల్లాకు మాత్రం నూటికి నూరు శాతం కృష్ణా నది ద్వారానే సాగు నీరు అందించాలని చెప్పారు. అందుకోసమే పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని డిజైన్ చేశామని వివరించారు. ఎత్తిపోతల పథకంపై ఎపి ప్రభుత్వం ఎన్ని కొర్రీలు పెట్టిన అపెక్స్ కమిటీతో వారి అనుమానాలు నివృత్తి చేశామని పేర్కొన్నారు. పాలమూరు ఎత్తిపోతల పథకం కట్టితీరుతామని, డిండి ఎత్తిపోతల పథకం కూడా పూర్తవుతుందని చెప్పారు. పాలమూరు ద్వారానే రంగారెడ్డి జిల్లాకు నీరందుతుందని తెలిపారు.