వేసవి కాలం దృష్ట్యా ఒకేసారి మూడు నెలలకు సరిపడా రేషన్ బియ్యం పంపిణీ

     ఏప్రిల్మేజూన్ నెలలకు సంబంధించిన బియ్యాన్ని ఏప్రిల్ నెలలోనే పంపిణీ

        కేంద్ర ప్రభుత్వం నిర్ణయం.. రాష్ట్రాలకు కేంద్ర పౌర సరఫరాల శాఖ లేఖలు

న్యూ డిల్లీ మార్చ్ 4 (ఆయుధం న్యూస్ _);రేషన్‌కార్డు లబ్ధిదారుల విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వేసవి కాలం దృష్ట్యా ఒకేసారి మూడు నెలలకు సరిపడా రేషన్ బియ్యం లబ్ధిదారులకు పంపిణీ చేయాలని నిర్ణయించింది. ఏప్రిల్, మే, జూన్ (మూడు నెలలకు) సంబంధించిన బియ్యాన్ని ఏప్రిల్ నెలలోనే పంపిణీ జరిగేలా చూడాలని రాష్ట్రాలకు కేంద్ర పౌర సరఫరాల శాఖ లేఖలు రాసింది. మార్చి మొదటి వారంలోనే ఎండలు మండిపోతున్నాయి. ఈ నేపథ్యంలోనే రాబోయే ఎండలను దృష్టిలో ఉంచుకొని కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా తెలంగాణలో రేషన్ కార్డు లబ్ధిదారులకు సన్నబియ్యం పంపిణీ చేస్తున్నారు. ఒక్కో లబ్ధిదారుడికి నెలకు 6 కిలోల చొప్పున సన్నబియ్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేస్తోంది. రాష్ట్రంలో దాదాపుగా ఫుడ్ సెక్యూరిటీ కార్డులు కోటికి పైగా ఉన్నాయి. ఒకేసారి మూడు నెలలకు సరిపడా కోటా ఇవ్వాలని కేంద్రం సూచించడంతో ఆ మేరకు సరిపడా బియ్యం కోటా నిలువలు, సాధ్యాసాధ్యాలను రాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తోంది. బియ్యం నిల్వ చేసే సామర్థ్యం లేకపోవడంతో ఒకేసారి మూడునెలల కోటా పంపిణీ చేయాలని కేంద్రం యోచిస్తుండగా గత అనుభవాల దృష్ట్యా అనేక సమస్యలు సైతం ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. గతేడాది వర్షాకాలంలో ఒకే దఫా మూడు నెలల కోటాను పంపిణీ చేశారు. ఆ సమ యంలో ఇటు లబ్ధిదారులు, రేషన్ డీలర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మూడు నెలల బియ్యం కోటా ఒకేసారి పంపిణీ చేయడం ద్వారా రవాణా ఛార్జీల ఖర్చు తగ్గనుండటంతో పాటు డీలర్లు, హమాలీ కూలీ కలిసొచ్చే అవకాశముంది. కానీ, ఆ బియ్యం నిల్వ చేసే సామర్థ్యం లేకపోవడంతో డీలర్లకు సమస్యగా మారింది. ఇక మూడు నెలలకు సంబంధించి ఒక్కో కార్డుదారుడు 3 సార్లు వేలి ముద్ర వేయాల్సి ఉంది. దీనికి తోడు సర్వస్ సమస్యలతో ఒక్కో కార్డుకు దాదాపు 1,5-20 నిమిషాల సమయం పట్టే అవకాశం ఉంది. ఈ సమస్యల గురించి అధికారులు ఆలోచిస్తున్నారు.