ఇది మనిషి సృష్టించిన విషాదం.. ఇరాన్‌లో 165 మంది బాలికల మృతి: కేటీఆర్‌

హైదరాబాద్ మార్చ్ 4 (ఆయుధం న్యూస్)ఇరాన్‌ పై ఇజ్రాయెల్,అమెరికా దాడులతో మధ్యప్రాచ్యం అట్టుడుకుతోంది. ఇజ్రాయెల్‌, అమెరికా బలగాలు వైమానికి దాడులతో ఇరాన్‌ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఇరాన్‌ కూడా ఇజ్రాయెల్‌పైన, తన పరిసర దేశాల్లోని అమెరికా సైనిక స్థావరాలపైన ప్రతిదాడులు చేస్తోంది. ఫలితంగా పశ్చిమాసియాలో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి.ఈ నేపథ్యంలో ఈ మారణహోమంపై బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ కామెంట్‌ చేశారు. ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్‌ సంయుక్తంగా జరిపిన దాడుల్లో ఓ బాలికల పాఠశాల నేలమట్టమవగా.. ఆ శిథిలాల కింద చిక్కుకుని 165 మంది బాలికలు ప్రాణాలు కోల్పోయారు. ఇవాళ వారి అంత్యక్రియలు విషాదకరంగా జరిగాయి.ఈ నేపథ్యంలో.. ‘పాఠశాలపై ఇజ్రాయెల్‌, అమెరికా బలగాలు జరిపిన దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన 165 మంది బాలికల అంత్యక్రియలకు సంబంధించిన భయంకరమైన, మనసును కలచివేసే దృశ్యాలు..’ అని పేర్కొంటూ కేటీఆర్‌ ఆ మరణించిన బాలికల సామూహిక సమాధుల దృశ్యాన్ని తన అధికారిక ఎక్స్‌ ఖాతాలో షేర్‌ చేశారు.యుద్ధం ఆవశ్యకత గురించి చెబుతున్న ఉద్దేశాలు ఏవైనా ఇది మనిషి సృష్టించిన విషాదమేనని కేటీఆర్‌ పేర్కొన్నారు. ఈ యుద్ధం రాబోయే తరాలకు బాధను, విషాదాన్ని మాత్రమే మిగిల్చుతుందని తన ఎక్స్‌ పోస్టులో రాసుకొచ్చారు.