(ఆయుధం న్యూస్ ) సంక్రాంతి పండగను స్వగ్రామంలో బంధువుల మధ్య జరుపుకోవాలనే సగటు ప్రయాణికుడి ఆశను రైల్వేశాఖ సొమ్ము చేసుకుంటోంది. ‘సువిధ’ రైళ్లలో ఆర్‌ఏసీ టికెట్ల పేరుతో బెర్తుల కంటే ఎక్కువ టికెట్లు విక్రయించడం దానికి దర్పణం. సాధారణ ఛార్జీతో పోలిస్తే ఆర్‌ఏసీ ప్రయాణికుల నుంచి ఐదారు రెట్లు అధికంగా వసూలు చేస్తూ జేబుకు చిల్లు పెడుతూనే, ఒక బెర్తును ఇద్దరికి కేటాయించడం దోపిడీకి పరాకాష్ట అని ప్రయాణికులు మండిపడుతున్నారు.
సంక్రాంతి రద్దీ నేపథ్యంలో సికింద్రాబాద్ నుంచి విజయవాడ, కాకినాడ, నర్సాపురం, విశాఖపట్నం నగరాలకు 10 నుంచి 13వతేదీ వరకు, అదే విధంగా పండగ తర్వాత తిరుగు ప్రయాణానికి అనుగుణంగా దక్షిణ మధ్య రైల్వే ‘సువిధ’ ప్రత్యేక రైళ్లు ప్రకటించింది. ఒక్క కాకినాడకే రోజుకు రెండు, మూడు సువిధ రైళ్లు నడుపుతోంది. స్లీపర్, ఏసీ బోగీల్లో రిజర్వేషన్ టికెట్లతోపాటు, ఆర్‌ఏసీ టికెట్లను ఇప్పటికే పెద్ద సంఖ్యలో విక్రయించింది. ఇవి పూర్తయ్యాక నిరీక్షణజాబితా టికెట్ల కేటాయింపునకూ వెళ్లింది.
ఇలా దోచేస్తున్నారు
సికింద్రాబాద్ నుంచి విజయవాడకు సాధారణ ఛార్జీ రూ.220. సువిధ రైళ్లలో డైనమిక్ విధానంలో గరిష్ఠ ధరను ప్రస్తుతం రూ.1,065గా నిర్ణయించారు. సికింద్రాబాద్- విశాఖపట్నం స్లీపర్ ఛార్జీ రూ.360. సువిధలో రూ.1365గా నిర్ణయించారు. పైగా ఆర్‌ఏసీ పేరుతో ఒక బెర్తును ఇద్దరికి కేటాయించేలా టికెట్లు విక్రయానికి పూనుకున్నారు. ఈ విధానం ఇతర రైళ్లలో ముందు నుంచే ఉన్నదే అయినా ఐదారు రెట్లు అధిక ఛార్జీలు వసూలు చేస్తున్న సువిధ రైళ్లలోనూ దాన్ని అనుసరించడం ఏమిటని ప్రయాణికులు మండిపడుతున్నారు.
బెర్తు దొరకదని తెలిసీ..
రిజర్వేషన్ ప్రయాణికుల్లో ఎవరైనా టికెట్ రద్దు చేసుకున్న పక్షంలో ఆర్‌ఏసీ టికెట్ ఉన్న వారికి ఆ బెర్తు ఖరారయ్యే అవకాశం ఉంటుంది. పండగ సమయంలో 3,4 రెట్ల అధిక ఛార్జీతో టికెట్ కొన్న వారు ప్రయాణం రద్దుచేసుకునే అవకాశాలు ఉండవని రైల్వే అధికారులే అభిప్రాయపడుతున్నారు. అంటే గమ్యస్థానం చేరే వరకు బెర్తులో పడుకునే అవకాశం ఉండదన్నమాట. అధికారులకు ఈ విషయం తెలిసినా రెట్టింపు ధరలు వసూలు చేస్తూ ప్రయాణికులను దోచుకోవడం ఎంతవరకు న్యాయమని ప్రయాణికులు ప్రశ్నిస్తున్నారు.
ఏసీ బోగీల్లోనూ నిరీక్షణే
సంక్రాంతి పర్వదినం, వరుస సెలవులు రావడంతో సొంతూళ్లకు భారీ సంఖ్యలో ప్రయాణమవుతున్నారు. ఛార్జీలు అధికంగా ఉంటే సువిధ రైళ్లలోనూ ఒకట్రెండు గంటల్లోనే రిజర్వేషన్ టికెట్లు అయిపోతున్నాయి. 11వ తేదీన సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం మీదుగా భువనేశ్వర్‌కు అన్ని ఏసీ బోగీలతో హమ్ సఫర్ రైలు (నెం.08508)ను ప్రకటిస్తే 30 నిమిషాల్లోనే థర్డ్ ఏసీ సీట్లు ఖాళీ అయ్యాయి. మరో 346 మంది నిరీక్షణ జాబితాలో ఉన్నారు. ఇతర ముఖ్యమైన రైళ్లలోనూ ఒక్కో దాంట్లో ఏసీ నిరీక్షణ జాబితా ప్రయాణికులు రెండొందలకు పైగానే ఉన్నారు.